iDreamPost

అర్హులకు వారంలో రేషన్ కార్డులు

అర్హులకు వారంలో రేషన్ కార్డులు

ఆంధ్రప్రదేశ్లో అర్హులైన వారందరికీ వారం రోజుల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉండాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. కరోనా ఉద్దీపన చర్యలు భాగంగా రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల నగదు అందించాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆయన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి, లాక్ డౌన్ అమలు, వ్యవసాయం తదితర అంశాలపై సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు.

లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా చూడాలని సూచించారు. పనిచేస్తున్న సమయంలో భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవసరమైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు ఈ జూన్ నుంచే పని చేయాలని సీఎం పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రతి సచివాలయం వద్ద రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కావాలన్నారు. వార్డ్, విలేజ్ క్లినిక్స్ సైతం వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

రేషన్ దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడి కుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఒక రేషన్ దుకాణం పరిధిలో రెండు మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రేషన్ తీసుకునేందుకు ప్రజలకు టోకెన్లు పంపిణీ చేయాలని సూచించారు. రేషన్ దుకాణాల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే వారికి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉండడమే మంచిదనెలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. క్వారంటైన్ పూర్తయిన వారిపై కూడా నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు. పీపీఈ కిట్లు, మాస్కులు నిరంతరం అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి