iDreamPost

బెజవాడ తెలుగు తమ్ముళ్లలో కొత్త బెంగ, నలిగిపోతున్నామని కలవరం

బెజవాడ తెలుగు తమ్ముళ్లలో కొత్త బెంగ, నలిగిపోతున్నామని కలవరం

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి గట్టిగా ఆశలు కనిపించే స్థానాల్లో విజయవాడ ఒకటుంటుంది. అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న 2019లో కూడా ఆపార్టీకి గుంటూరు, విజయవాడ లోక్ సభ స్థానాల్లో విజయం దక్కడం విశేషం. రెండు నగరాల పరిధిలోనూ ఒక్కో అసెంబ్లీసీటుని కూడా వశం చేసుకున్నారు.దాంతో వచ్చే ఎన్నికల్లో ఊరట లభిస్తుందనే ఆశాభావం టీడీపీ అధిష్టానంలో ఉంది. అందులోనూ ఇటీవల రాజకీయ పరిణామాల మూలంగా అమరావతి ఏకైక రాజధానిగా కట్టుబడి ఉన్న తమకు కనీసం ఈ ప్రాంతంలోనయినా జనం పట్టంగడతారని అంచనా వేస్తోంది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా బెజవాడ తెలుగు తమ్ముళ్లు బెంగ పెట్టుకుంటున్నారు. పార్టీ పరిస్థితి ఢోలాయమానంలో కనిపిస్తుందని కలవరపడుతున్నారు.

టీడీపీ క్యాడర్ ఇప్పుడు ఇరకాటంలో పడి నలిగిపోతున్నారు. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో సతమతం అవుతున్నారు. అధికారంలో ఉండగా మంత్రి హోదాలో దేవినేని ఉమా నగర రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు మొదలయిన విబేధాలు ఇప్పుడు విపక్షంలో ఉండగా ఉదృతమవుతూనే వస్తున్నాయి. ఇటీవల మునిసిపల్ ఎన్నికల్లోనూ అది బహిర్గతమయ్యింది. ప్రస్తుతం ఎంపీ కేశినేని నాని దూకుడుగా ఉన్నారు. విజయవాడ సిటీతో పాటుగా నందిగామ నియోజకవర్గంలోనూ తన పట్టు చాటుకోవాలని యత్నిస్తున్నారు. దేవినేని ఉమాకి చెక్ పెట్టి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. దాంతో ఈ ఆధిపత్య పోరు ప్రభావం అటు నందిగామ నుంచి ఇటు విజయవాడ నగరం వరకూ అన్ని నియోజకవర్గాల్లోనూ బహిరంగమవుతోంది.

విజయవాడలో బుద్ధా వెంకన్న, బోండా ఉమా తో పాటుగా నాగూల్ మీరా కూడా కేశినేని నానికి వ్యతిరేకంగా ఉన్నారు. దాంతో వీరికి దేవినేని ఉమా అండగా ఉంటున్నారనే అభిప్రాయం నాని వర్గీయుల్లో ఉంది. దీనిని ఎదుర్కోవడానికి కేశినేని వర్గం వివిధ రూపాల్లో కసరత్తులు చేస్తోంది. ఈ యత్నాలే పార్టీ కార్యకర్తలను ఇరకాటంలోకి నెడుతోంది. ఆధిపత్య పోరుతో అసలుకే ఎసరు వస్తుందనే వాదన బలపడుతోంది. సరిగ్గా అదే సమయంలో వంగవీటి రాధా వ్యవహారం టీడీపీని అడకత్తెరలో పోకచెక్కలా మార్చేస్తోంది. ఓవైపు పార్టీ నాయకుల మధ్య విబేధాలు పరువు తీస్తుండగా, రెండోవైపు రాధా నేరుగా కొడాలి నానితో బహిరంగంగా కలిసి తిరగడం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. నగరంలో కమ్మ వ్యతిరేకత కనిపించకుండా ఇతర కులస్తులను ముందుపెట్టి చక్రం తిప్పాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. కానీ కాపుల్లో కీలకనేత వంగవీటి రాధా అందుకు విరుద్ధంగా సాగుతున్నారు.

ఇటీవల గన్నవరం వెళ్లి నానితో భేటీ అయిన రాధా తాజాగా చాయ్ పే చర్చ సాగించడం విస్తృతంగా వైరల్ అవుతోంది. టీడీపీ నాయకత్వాన్ని మాత్రమే కాకుండా కార్యకర్తలకు కూడా మింగుడుపడని రీతిలో మారుతోంది. చివరి నిమిషంలో రాధా ఏం చేస్తారోననే అనుమానం బలపడుతోంది. వాస్తవానికి ఇటీవల నేరుగా రాధా ఇంటికెళ్లి చంద్రబాబు మంత్రాంగం నడిపి వచ్చారు. దాంతో కొడాలి నానితో స్నేహాన్ని వదులుకుంటారని టీడీపీ ఆశించింది. అందుకు భిన్నంగా రాధా మరింత బహిరంగంగా సంకేతాలు పంపిస్తున్నారు. టీడీపీని చిక్కుల్లో నెడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో కూడా రాధాకి టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం దాదాపు ఉండదు. దానికి అనేక కారణాలుండగా రాధా ఆశిస్తున్న తూర్పు సీటులో గద్దె రామ్మోహన్ బలం చాటుకుంటుండడం కూడా అందులో ఒకటి. ఈ పరిస్థితుల్లో రాధా తీసుకోబోయే నిర్ణయం టీడీపీని పీకల్లోతు కష్టాల్లో నెట్టే ప్రమాదం ఉంటుంది. దానిని అధిగమించడం ఎలా అన్నది అర్థం కాని స్థితిలో టీడీపీ తల్లడిల్లిపోవాల్సిన స్థితి తాజా పరిణామాలతో పెరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి