iDreamPost

ఆర్ఆర్ఆర్ మీద అయోమయ ప్రచారం

ఆర్ఆర్ఆర్ మీద అయోమయ ప్రచారం

టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తం మీద క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకో జూలైలోపు పూర్తి కానుంది. ఆపై నాలుగైదు నెలలు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ కోసం ప్లాన్ చేసుకున్న జక్కన్న ఈసారి బాహుబలి రికార్డులను తనే బద్దలు కొట్టాలని గట్టి నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ “రామ రావణ రాజ్యం”గా ఫిక్సయ్యిందని ఓ మీడియాలో వస్తున్న వార్తలు అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం “రఘుపతి రాఘవ రాజారామ్” గా డిసైడ్ చేశారని మరో టాక్ కూడా ప్రచారం జరిగింది.

వీటి సంగతెలా ఉన్నా యూనిట్ మాత్రం ఈ విషయాల పట్ల స్పందించేందుకు ఇష్టపడటం లేదు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి టైటిల్ విషయంలో తొందరపడకుండా అన్ని బాషలలో ఒకేసారి రివీల్ చేసేలా ఓ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట. మరి ఇప్పుడు చర్చలోకి వచ్చిన పేర్లు నిజమా కాదా అనే నిర్ధారణ కూడా ఎవరూ చేయడం లేదు. స్వాతంత్రం రాకముందు కాలానికి చెందిన కథలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తారు. బ్రిటిషర్లతో యుద్ధం అసలు నేపధ్యంగా ఉంటుంది.

మరి అలాంటప్పుడు రామ రావణ రాజ్యం అనే టైటిల్ అంతగా సింక్ అవ్వదేమో అనే సందేహాలు రావడం సహజం. రాజమౌళి మనసులో టైటిల్ కు సంబంధించి పూర్తి క్లారిటీ ఉందని టైం చూసుకుని దాన్ని బయటపెడతారని అంతవరకు దీన్ని పట్టించుకునే ఉద్దేశంలో లేరని ఇన్ సైడ్ టాక్. కీరవాణి సంగీతం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు ప్రత్యేక ఆకర్షణలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ ఫేం అలియా భట్, అజయ్ దేవగన్ లాంటి వాళ్ళు నటిస్తుండటంతో మార్కెట్ పరంగా చాలా ప్లస్ కానుంది. ఇప్పుడీ టైటిల్ సస్పెన్స్ కు చెక్ పెట్టాల్సింది రాజమౌళినే. అయితే అంతత్వరగా దాన్ని చేసేలా లేడు. అప్పటిదాకా ఈ ప్రచారాలకు బ్రేక్ పడటం కష్టమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి