iDreamPost

చీరాలలో గెలిచిందెవరు..?

చీరాలలో గెలిచిందెవరు..?

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికలో 12 కార్పొరేషన్లు, 75 పుర. నగర పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. ఒక్క చీరాల మున్సిపాలిటీ తప్పా మిగతా చోట్లా రాజకీయం, ఫలితాలు ఒకేలా ఉన్నాయి. కానీ చీరాలలో మాత్రం చిత్రమైన రాజకీయ పరిస్థితి కనిపించింది. ఇక్కడ టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోగా.. వైసీపీలో నాయకత్వం కోసం నేతల మధ్య ఆధిపత్యం నెలకొంది. కరణం బలరాం వైసీపీలో చేరిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరాం వర్గాల మధ్య మొదలైన ఆధిపత్యపోరు పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కొనసాగింది.

వైసీపీలో నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో ఇక్కడ మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలతో పోల్చుకుంటే భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ తరఫున నాయకత్వం కోసం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్, పార్టీలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య పోటీ నెలకొంది. అనేక చర్చలు, సమాలోచనలు తర్వాత వైసీపీ తరఫున బీ ఫాం ఇచ్చే అవకాశం కరణం బలరాంకు దక్కింది. తన వర్గాన్ని నిలుపుకునేందుకు ఆమంచి అభ్యర్థులను పోటీలో నిలబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పార్టీకి వ్యతిరేకం కాదని, తన వర్గాన్ని కాపాడుకునేందుకే పోటీ చేస్తున్నామంటూ ఆమంచి ఎన్నికలకు ముందే చెప్పారు.

చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. మూడు వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 30 వార్డుల్లో పోటీ నెలకొంది. 30 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులతోపాటు ఆమంచి వర్గీయులు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 30 వార్డుల్లోనూ అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. ఆ పార్టీ కేవలం 13 వార్డుల్లోనే పోటీ చేసింది. 17 వార్డుల్లో వైసీపీ, ఆమంచి వర్గం అభ్యర్థుల మధ్య, 13 వార్డుల్లో త్రిముఖ పోరు జరిగింది. ఈ పోరులో 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 13 వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. ఈ 13 మందిలో 11 మంది ఆమంచి వర్గీయులే కావడం విశేషం. టీడీపీ ఒకే ఒక్క చోట మూడో వార్డులో 113 ఓట్ల మెజారిటీతో గెలిచింది.

Also Read : ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో ఓటు తిరస్కరణ.. తాడిపత్రిలో ఏం జరగబోతోంది..?

ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ (కరణం బలరాం) 19 వార్డులు, ఆమంచి వర్గం 11 వార్డులు, స్వతంత్రులు రెండు, టీడీపీ ఒక వార్డులో గెలుపొందాయి. ఆమంచి వల్ల వైసీపీ ఓడిపోయిందనే విమర్శలు రాకుండా ఉండేలా వైసీపీ 19 వార్డులు గెలుచుకుంది. అదే సమయంలో 11 వార్డుల్లో తన అభ్యర్థులను గెలిపించుకుని చీరాలలో ఆమంచి కూడా నిలిచారు. వైసీపీలో అటు బలరాం, ఇటు ఆమంచి.. ఇద్దరూ ఇద్దరే అని మున్సిపల్‌ ఎన్నికల ద్వారా తేలిపోయింది.

కరణం బలరాం వైసీపీలో చేరడంతో నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి చుక్కాని లేని నావ మాదిరిగా తయారైంది. అంతకు ముందే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ గూటికి చేరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ వైసీపీ తరఫున పెద్దల సభకు వెళ్లారు. సీటు రాలేదని ఎన్నికలకు ముందు యాడం బాలజీ వైసీపీ నుంచి టీడీపీలో చేరినా.. ఆ తర్వాత ఆయన మిన్నుకుండిపోయారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుతోంది. దీంతో ఇక్కడ టీడీపీకి ఇంఛార్జి కూడా కరువయ్యారు. పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు రాజశేఖర్‌ చీరాలలో టీడీపీ అభ్యర్ధులుకు బీ ఫాం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read : సత్తా చాటిన అన్నా రాంబాబు.. పత్తాలేని జనసేన

చైర్మన్‌ పీఠం ఎవరి మద్ధతు లేకుండానే వైసీపీ గెలుచుకోబోతోంది. 33 వార్డుల్లో వైసీపీ 19 వార్డులు గెలుచుకుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎంపీల ఎక్స్‌ అఫిషియో ఓట్లు ఎలానూ ఉన్నాయి. చైర్మన్‌ పీఠంపై ముగ్గురు ఆశలు పెట్టుకున్నారు. రెండోసారి గెలిచిన వైశ్య సామాజికవర్గానికి చెందిన పొత్తూరి సుబ్బయ్య (18వ వార్డు), 19వ వార్డు నుంచి గెలిచిన మించాల సాంబశివరావు యాదవ్, 5వ వార్డు నుంచి గెలిచిన సూరగాని లక్ష్మీ గౌడ్‌లు చైర్మన్‌ రేసులో ఉన్నారు.

ఆమంచి వర్గం కూడా 11 వార్డుల్లో గెలవడంతో.. వారు మున్సిపాలిటీలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చైర్మన్‌ పీఠం కరణం వర్గానికి, వైస్‌ చైర్మన్‌ పీఠం ఆమంచి వర్గానికి కేటాయిస్తే.. మున్సిపాలిటీలో ఇక ప్రతిపక్షమే ఉండదు. టీడీపీకి ఉన్న ఒకే ఒక్క కౌన్సిలర్‌ ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం తథ్యం. మరి ఈ నెల 18వ తేదీన జరిగే చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Also Read : గొట్టిపాటిని నిరాశపరిచిన అద్దంకి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి