iDreamPost

భారత క్రికెట్ మహిళల జట్టు అలా.. పురుషుల జట్టు ఇలా..

భారత క్రికెట్ మహిళల జట్టు అలా.. పురుషుల జట్టు ఇలా..

భారత క్రికెట్ జట్టుకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. టీ 20 వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు దూసుకుపోతుంటే, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత పురుషుల జట్టు మాత్రం పరాజయాల పరంపరను కొనసాగిస్తుంది. న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ను వైట్ వాష్ చేసిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. కానీ తదనంతరం జరిగిన వన్డే సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కి గురైంది..

తొలి టెస్టులో అసలు పోరాడకుండానే ఘోర ఓటమి చవి చూడటంతో భారత క్రికెట్ జట్టుపై విమర్శలు మొదలయ్యాయి. అదే పరంపర కొనసాగిస్తూ రెండో టెస్టులో కూడా పేలవ ప్రదర్శన చేస్తూ ఓటమి ముంగిట నిలిచింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పేలవ ఫార్మ్ భారత జట్టును కలవరపెడుతుంది. న్యూజిలాండ్ సిరీస్ లో ఓపెనర్లు కుదురుకోక పోవడం వల్ల సరైన భాగస్వామ్యాల నిర్మాణం జరగలేదు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, షమీ పేలవ బౌలింగ్ ప్రదర్శన వల్ల వికెట్లు లభించడం లేదు . కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్న రాహుల్ ని పక్కన పెట్టడం వల్ల భారత జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. రెండో టెస్టులో తొలిరోజు ఆటలో పూర్తి ఆధిపత్యం కనబర్చిన న్యూజిలాండ్ పైచేయి సాధించింది. ఓటముల నుండి భారత జట్టు పాఠాలు నేర్చుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే భారత మహిళల జట్టు మాత్రం అద్భుత పోరాట పటిమతో టీ20 వరల్డ్ కప్ లో ఆడిన నాలుగు మ్యాచుల్లో ఘనవిజయాలు సాధించి సెమీ ఫైనల్ చేరుకోవడంతో భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా తమకంటే బలమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లను ఓడించడంతో భారత మహిళా జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది.. బ్యాటింగ్ లో షెఫాలీ వర్మ, బౌలింగ్ లో పూనమ్ యాదవ్ రాణించడంతో భారత మహిళల జట్టుకు సునాయాస విజయాలు దక్కాయి. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రాధా యాదవ్ 4 వికెట్లతో చెలరేగడంతో శుభపరిణామంగా చెప్పవచ్చు. ఇదే పోరాట పటిమను ప్రదర్శిస్తే టీ 20 వరల్డ్ కప్ చేజిక్కించుకోవడం అంత కష్టం కాకపోవచ్చు. కానీ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన పేలవ ఫార్మ్ ఆందోళన కలిగించే అంశం. కానీ సమిష్టి కృషితో సాధించిన విజయాలతో ఈ వరల్డ్ కప్ లో సెమీస్ లో చేరిన మొదటి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి