iDreamPost

అదే చంద్రబాబుకు జగన్‌కు మధ్య వ్యత్యాసం..!

అదే చంద్రబాబుకు జగన్‌కు మధ్య వ్యత్యాసం..!

విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే తన లక్ష్యమని వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ఆ మాటను తు.చ తప్పకుండా వైఎస్‌ జగన్‌ పాటిస్తున్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ తాను నిర్థేశించుకున్న విధానాలకు అనుగుణంగా రాజకీయాలు చేశారు. ప్రజా ప్రతినిధి మరణిస్తే.. ఉప ఎన్నికల్లో తన పార్టీకి చెందిన అభ్యర్థిని పోటీలో పెట్టబోనని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడమే కాదు… పక్కాగా అమలు చేసి చెప్పిన మాట తప్పబోనని మూడు సార్లు నిరూపించారు.

అధికారంలో ఉన్నది ఏ పార్టీ ప్రభుత్వమైనా జగన్‌ తన విధానానికి కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2011లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను స్థాపించిన వైఎస్‌ జగన్‌.. కాంగ్రెస్, టీడీపీ పార్టీల ప్రభుత్వాలలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఈ సమయంలో నాలుగు ఉప ఎన్నికలు వచ్చాయి. టీడీపీ ప్రజా ప్రతినిధులు ముగ్గురు, వైసీపీ చెందిన ఒకరు అకాల మరణంతో ఉప ఎన్నికలు జరిగాయి. టీడీపీ ప్రజా ప్రతినిధులు చనిపోయిన స్థానాల్లో వైసీపీ తన అభ్యర్థులను నెలబెట్టకుండా సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది.

2013లో కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అంబటి బ్రహ్మయ్య, 2014లో కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్, అదే ఏడాదిలో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణలు మరణించడం వల్ల ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌.. ఏ పార్టీ తరఫున ఆ సీటు ఖాళీ అయిందో.. ఆ స్థానం ఆ పార్టీకే చెందాలనే సత్సంప్రదాయాన్ని ప్రారంభించారు. 2017లో నంద్యాల ఉప ఎన్నికలో మాత్రం వైసీపీ తన అభ్యర్థిని నిలబెట్టింది. ఇక్కడ వైసీపీ తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరారు. గుండెపోటుతో ఆయన మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అయితే ఆ స్థానం వైసీపీది కావడంతో వైఎస్‌ జగన్‌ తన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టారు. టీyీ పీ కూడా అభ్యర్థిని నిలబెట్టడంతో పోలింగ్‌ అనివార్యమైంది.

అయితే జగన్‌ పాటించిన సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు పాటించకపోవడంతో ఈ విషయాలు ప్రస్తుతం ఏపీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధి చనిపోయిన స్థానంలోఉప ఎన్నిక ఏకగ్రీవం అవ్వడమే సముచితమని భావించిన సీఎం వైఎస్‌ జగన్‌ విధానాన్ని.. చంద్రబాబు పాటించాలని రూలేమీ లేదు. కానీ దేశంలో సీనియర్‌ రాజకీయ నాయకుడనని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి.. రాజకీయమే తనకు ముఖ్యమనేలా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టడం గమనార్హం.

తిరుపతి లోక్‌సభ నుంచి 2019లో వైసీపీ తరఫున బల్లి దుర్గా ప్రసాద్‌ గెలిచారు. ఇటీవల కరోనా వల్ల ఆయన అకాల మరణం పొందారు. ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అన్ని పార్టీల కన్నా ముందే టీడీపీ తన అభ్యర్థిగా పనబాక లక్ష్మీని ప్రకటించింది. ఈ పరిణామంతోనే తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజకీయాలలో.. వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులు అవలంభిస్తున్న రాజకీయ విధానాలపై చర్చించుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం అంత వయస్సు ఉన్న వైఎస్‌ జగన్‌.. రాజకీయాల్లో నైతిక విలువలు, సత్సాంప్రదాయాలు పాటిస్టుంటే.. చంద్రబాబు మాత్రం ఓట్లు, సీట్లే ముఖ్యమనేలా ప్రవర్తిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి