iDreamPost

పీవీ అప్పుడే రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారా..?

పీవీ అప్పుడే రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారా..?

రాజకీయాల్లోకి రావడం లేదని ప్రముఖ నటుడు, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించేశారు. దక్షిణ భారత్‌ దేశంలోనూ కాదు ఉత్తర భారత్‌ దేశంలోనూ రజనీకాంత్‌ అంటే తెలియని సినీ అభిమానులు ఉండరు. ముఖ్యంగా దక్షిణ భారత సినీ ప్రపంచంలో రజనీకాంత్‌ ఒక సంచలనం. అబ్బురపరిచే ఆయన సై్టల్‌ను ఆరేళ్ల బాలుడు నుంచి ఆరవై ఏళ్ల వృద్ధుల వరకూ పాటించేందుకు ఆసక్తి చూపేవారు. ఇంతటి ప్రజాదారణ ఉన్న సినీ నటుడు.. రాజకీయాల్లోకి వస్తే సంచలనాలేనన్న విశ్లేషణలు సాగాయి. వస్తున్నా.. అంటూ ప్రకటన.. ఆ తర్వాత వాయిదా.. మళ్లీ అదే ప్రకటన.. ఇలా మూడు దశాబ్ధాలుగా రజనీ రాజకీయ రంగ ప్రవేశం ఎన్నో మలుపులు తిరిగింది. మొత్తం మీద తన రాజకీయ జీవన ప్రయాణంపై రజనీ స్పష్టత ఇవ్వడంతో ఊహాగానాలకు ఇకపై ఫుల్‌స్టాప్‌ పడినట్లే.

1996లో మొదలు..

రెండున్నర దశాబ్ధాల క్రితమే రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే టాక్‌ నడిచింది. తమిళనాడులో అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ ప్రధాని పీవీ నరశింహారావు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు 1996లోనే ప్రయత్నం చేశారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశానికి అంతా సిద్ధమైందనుకున్న తరుణంలో చివరి నిమిషంలో బాషా వెనక్కితగ్గారు.

పీవీ ఆఫర్‌.. ముఖ్యమంత్రి అభ్యర్థి..

1996 ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్‌పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని పీవీ చేయించిన సర్వేలో తేలిసింది. అన్నాడీఎంకేతో పొత్తు వల్ల నష్టం తప్పదని, అదే విధంగా రాజీవ్‌ హత్య అనంతరం ఎల్‌టీటీకీ మద్ధతు ప్రకటించిన డీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌కు అవకాశం లేకుండా పోయింది. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో పీవీ సూచనతో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ నేత ముపనార్‌ ఎన్నికలకు రెండు నెలల ముందు అంటే 1996 ఫిబ్రవరిలో రజనీకాంత్‌ను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. పీవీతో రజనీ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని పీవీ.. రజనీకాంత్‌కు చెప్పారు. కాంగ్రెస్‌లో చేరి రాజకీయ ప్రవేశం చేసేందుకు రజనీకాంత్‌ ఉత్సాహంగా అంగీకరించారు.

రాత్రికి రాత్రే మారిన నిర్ణయం..

రజనీ రాజకీయ ప్రవేశంపై విషయం తెలుసుకున్న తమిళ కాంగ్రెస్‌ వర్గాలు మరుసటి రోజు రజనీకాంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి భారీగా తరలి వచ్చారు. రజనీ ఢిల్లీ నుంచి మద్రాసు విమానాశ్రయానికి వచ్చారు. ప్రయాణికులు అందరూ బయటకు వచ్చారు. కానీ రెండున్నర గంటలైన రజనీ మాత్రం విమానాశ్రయం నుంచి బయటకు రాలేదు. ఏం జరిగిందో ఏమో గానీ.. రజనీ కాంగ్రెస్‌లో చేరడంలేదని సమాచారం ఢిల్లీ నుంచి రావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు నిరుత్సాహంగా వెనుతిరిగాయి.

సాయంత్రం రజనీ స్పష్టత..

రజనీ రాజకీయ రంగ ప్రవేశం దాదాపు ఖాయమై.. చివరి నిమిషంలో రద్దయిన విషయంపై తమిళనాట తీవ్ర చర్చ సాగుతోంది. ఎన్నికల సమయం కావడంతో ఈ విషయం పతాకస్థాయిలో ప్రజల మధ్య నలుగుతోంది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయని రజనీకాంత్‌.. ఢిల్లీ నుంచి వచ్చిన రోజు సాయంత్రమే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పీవీని మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.

ఆ తర్వాతా ఊహాగానాలు..

1996 తర్వాత కూడా రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై అనేకసార్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఎప్పటికప్పుడు రజనీ వాటిని తోసిపుచ్చడమో. తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రావడమో చేశారు. అయితే 2017లో జయలలిత మరణం తర్వాత తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో విధి విధానాలు వెల్లడిస్తానని చెప్పారు. అయితే ఆ తర్వాత ఎప్పటిలాగే కాలం గడిపేశారు. మళ్లీ తమిళనాడు ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం ఉందనగా ఇటీవల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ పేరు, ఇతర వివరాలు ఈ నెల 31వ తేదీన వెల్లడిస్తానని చెప్పారు. ఈ లోపు ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు. దేవుడే తనను రాజకీయాల్లోకి వెళ్లద్దని ఈ ఘటన ద్వారా చెప్పారంటూ.. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను పూర్తిగా విడిచిపెడుతున్నట్లు ప్రకటించి దాదాపు మూడు దశాబ్ధాలుగా సాగిన.. చర్చకు ముగింపు పలికారు.

Read Also : దేవుడు ఆదేశించాడు.. రజనీ వెనక్కితగ్గారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి