iDreamPost

కార్తీ దుల్కర్ రూట్లో ధనుష్

కార్తీ దుల్కర్ రూట్లో ధనుష్

మనకు రాని భాషలో డబ్బింగ్ చెప్పాలంటే ఏ హీరోకైనా ఇబ్బందే. అంత అనుభవమున్న రాజశేఖర్ ఇప్పటిదాకా స్క్రీన్ మీద తన స్వంత గొంతు వినిపించలేదు. సుమన్ ఏళ్ళ తరబడి సాయికుమార్ మీద ఆధారపడ్డారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బ్రతికి ఉన్నన్ని రోజులు కమల్ హాసన్ ఏనాడూ తన తెలుగు డబ్బింగ్ సినిమాలకు గాత్రం ఇచ్చే సాహసం చేయలేదు. అందులో ఉన్న ప్రాబ్లమ్ అలాంటిది. కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా ఎంత రిస్క్ అయినా సరే తామే మాట్లాడాలని బాష నేర్చుకుని మరీ కష్టపడతారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మమ్ముట్టి గురించి. దళపతిలో ఆయన స్వరం కాకుండా ఇంకెవరని ఊహించుకోలేం.

ఇప్పటి తరంలో ఆయన వారసుడు దుల్కర్ సల్మాన్ తండ్రి బాటలో నడుస్తూ మహానటి, కనులు కనులు దోచాయంటేలో తన ఓన్ వాయిసే ఇచ్చారు. అదెంత న్యాచురల్ గా వచ్చిందో వాటి విజయాన్ని ఆస్వాదించిన ఆ మలయాళ నటుడికి బాగా తెలుసు. సీతారామంకి కూడా అదే కంటిన్యూ చేయబోతున్నాడు.కార్తీ కూడా అంతే. మొదట్లో ఒకటి రెండు చెప్పుకోలేదు తర్వాత లాంగ్వేజ్ ని ఓ పట్టు పట్టి మరీ తన డబ్బింగ్ తనే చెప్పుకున్నాడు. సూర్య సైతం ఈటి, బ్రదర్స్, ఎన్జికె లాంటి వాటిలో కష్టపడ్డారు కోలీవుడ్ మల్లువుడ్ హీరోలు ఇలా తాపత్రయపడటం మంచిదే. కాకపోతే మనవాళ్ళు మార్కెట్ పరిమితుల వల్ల ఎవరికీ ఆ అవసరం పడలేదు.

తాజాగా ధనుష్ ఈ లిస్టులోకి చేరబోతున్నాడు. వెంకట్ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సర్ కోసం తనే డబ్బింగ్ చెప్పుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం. రఘువరన్ బిటెక్ తర్వాత ధనుష్ కు తెలుగులో మార్కెట్ అంతగా బలపడలేదు. తమిళంలో హిట్లు కొడుతున్నా అవి ఇక్కడ అనువాదం అయ్యే కంటెంట్ తో ఉండటం లేదు. అందుకే వడ చెన్నై, కర్ణన్ లాంటివి ఎంత పెద్ద సక్సెస్ అయినా వాటిని మనవాళ్ళు తమిళంలోనే చూడాల్సి వచ్చింది. అందుకే సర్ మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. మిస్టర్ మజ్ను, రంగ్ దేలతో వరసగా నిరాశపరిచిన వెంకీ అట్లూరికి ఈ సర్ విజయవంతం కావడం చాలా అవసరం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి