iDreamPost

ధమాకా నాన్ స్టాప్ 100 కోట్ల మాస్

ధమాకా నాన్ స్టాప్ 100 కోట్ల మాస్

రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ధమాకా పట్టుమని పదిహేను రోజులు కాకుండానే వంద కోట్ల గ్రాస్ ని అందుకోవడంతో మాస్ మహారాజా కెరీర్ లోనే అతి పెద్ద హిట్ అతని ఖాతాలో పడింది. రివ్యూలు టాక్ లతో సంబంధం లేకుండా ఆడియన్స్ దీన్ని ఎంజాయ్ చేయడంతో భారీ వసూళ్లు వచ్చాయి. అయితే వాస్తవిక ఫిగర్లు ఇంత లేవనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ప్రొడక్షన్ హౌస్ స్వయంగా చెప్పినప్పుడు కొట్టిపారేయడానికి లేదు. చాలా సెంటర్లలో వీక్ డేస్ లోనూ డీసెంట్ కలెక్షన్లు వస్తుండగా వారాంతాల్లో మాత్రం సులభంగా హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతున్నాయి. పాటలు, వాటికి హీరో హీరోయిన్ డాన్సులు, శ్రీలీల గ్లామర్ బొమ్మని గట్టిగా నిలబెట్టాయి.

ఈ రోజు శుక్రవారం అయిదారు కొత్త రిలీజులు ఉన్నప్పటికీ వాటి ప్రభావం శూన్యమనే చెప్పాలి. కనీస ఓపెనింగ్స్ నోచుకునే అవకాశం లేకపోవడంతో కేవలం మౌత్ టాక్ మీద ఆధారపడ్డాయి. ఇంకో అయిదే రోజుల్లో సంక్రాంతి సినిమాల దాడి మొదలవుతుంది కాబట్టి వీటినెవరూ అంతగా పట్టించుకోవడం లేదు. ధమాకాకు ఈ లెక్కన 10వ తేదీ దాకా బ్రేకులు పడే ఛాన్స్ లేదు. 18 పేజెస్ కి డీసెంట్ టాక్ వచ్చినా మరీ స్ట్రాంగ్ గా నిలదొక్కుకోలేదు కానీ ఇప్పటికీ అయిదు వందల స్క్రీన్లకు పైగా ప్రదర్శిస్తుండటం మంచి ఫీటే. మరోవైపు అవతార్ 2 ఎప్పుడో లాభాల్లోకి ప్రవేశించినా అమాంతం డౌన్ అయిపోలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తోంది

ధమాకా విజయానికి కారణాలు ఎలా ఉన్నా రిలీజ్ టైమింగ్ ఎంత కీలకమో దీని ద్వారా తెలిసి వచ్చింది. స్టోరీ స్క్రీన్ ప్లే ఎంత రొటీన్ ఉన్నా రెండు మాస్ మసాలా కిక్కిచ్చే పాటలు, పేలిపోయే రేంజ్ లో మూడు కామెడీ ఎపిసోడ్లు వెరసి పైసా వసూల్ కి ఇవి చాలనుకున్నారు ఆడియన్స్. అందుకే హిట్ స్టాంప్ పడింది. ఇప్పుడీ రిజల్ట్ వాల్తేరు వీరయ్యకు ఉపయోగపడనుంది. ఎలాగూ రవితేజ దీని ప్రమోషన్లలో కూడా యాక్టివ్ గా పాల్గొంటాడు కాబట్టి చిరంజీవితో పాటు బజ్ ని పెంచేందుకు తన ప్రమేయం చాలా హెల్ప్ అవుతుంది. ధమాకా దెబ్బకు దర్శకుడు త్రినాథరావు నక్కిన, రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ల డిమాండ్ పెరిగిపోయిందని టాక్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి