iDreamPost

ఇది వ్యవస్ధల ఫెయిల్యూర్ కాదా ? మరీ ఇంత నిర్లక్ష్యమా ?

ఇది వ్యవస్ధల ఫెయిల్యూర్ కాదా ? మరీ ఇంత నిర్లక్ష్యమా ?

ప్రార్ధనల పేరుతో కొన్ని వేలమంది కొద్ది రోజుల పాటు ఒకేచోట గుమిగూడినా ఎవరు పసిగట్టలేకపోయారంటే ఏమిటర్ధం ? సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, పోలీసులు, మున్సిపల్ వ్యవస్ధ హోలు మొత్తం మీద ప్రభుత్వమే ఫెయిలైనట్లు కాదా ? ఇదంతా దేనిగురించో ఈపాటికే అర్ధమయ్యుంటుంది. అవును కరెక్టే ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనల గురించే.

ప్రార్ధనలు మొదలయ్యే రోజుకు కరోనా వైరస్ తీవ్రత దేశంలో పెద్దగా లేదు. కానీ ప్రార్ధనలు పూర్తయ్యేనాటికి వైరస్ ప్రభావంపై దేశంలో ఆందోళనలు పెరిగిపోతున్నాయన్నది వాస్తవం.

మార్చి 1-15 తేదీల మధ్య ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో ప్రార్ధనలు జరిగాయి. దీనికి విదేశాల నుండి 1500 మందితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుండే సుమారు 2500 మంది పాల్గొన్నట్లు తాజా సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రార్ధనలు మొదలైన మార్చి 1వ తేదీకి దేశంలో కరోనా వైరస్ తీవ్రత పెద్దగా లేదనే చెప్పాలి.

కానీ అప్పటికే వైరస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారమైతే మొదలుపెట్టాయి. ఎందుకంటే అప్పటికే చైనా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లాంటి దేశాల్లో సమస్య చాలా తీవ్రంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు ప్రపంచ దేశాలను వైరస్ వణికించేస్తున్నపుడు ఢిల్లీలో వేలాది మంది రెండు వారాల పాటు మత ప్రార్ధనల పేరుతో ఒకే చోట ఉంటున్న విషయం ప్రభుత్వానికి తెలియక పోవటమే విచిత్రంగా ఉంది.

పైగా మర్కజ్ మసీదు నిజాముద్దీన్ పోలీసు స్టేషన్ కు చాలా దగ్గరలోనే ఉందంటున్నారు. మత ప్రార్ధనల పేరుతో వేలాది మంది ఒకేచోట గుమిగూడుతున్న విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయింది ? ఇంటెలిజెన్స్ వ్యవస్ధ యాక్టివ్ గా ఉండుంటే మార్చి 15వ తేదీన ప్రార్ధనలు పూర్తయ్యే నాటికి వాళ్ళందరినీ ఢిల్లీలోనే ఆపేసి పరీక్షలు చేయించే అవకాశం ఉండేది కదా. అప్పుడు వైరస్ మిగిలిన రాష్ట్రాలకు పాకేది కాదు. అసలు విదేశాల నుండి 1500 మంది ఢిల్లీకి వచ్చి మత ప్రార్ధనల్లో పొల్గొంటుంటే కేంద్రం ఏమి చేస్తోంది ?

ఇన్ని వందల మంది ఒక్కసారిగా విదేశాల నుండి ఢిల్లీకి ఎందుకు వస్తున్నారనే అనుమానం కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ కు రాలేదా ? వచ్చిన వాళ్ళను విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ చేసుంటే వైరస్ సోకిన విషయం బయటపడేదే కదా ? విదేశాల నుండి వచ్చిన వారి వల్ల దేశంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళ ద్వారా రాష్ట్రాల్లోని కొన్ని వేలమందికి కరోనా వైరస్ సోకితే అందుకు బాధ్యులెవరు ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి