iDreamPost

సీఎం మీద కామెంట్స్ చేసిన డీఈఈ సస్ఫెన్షన్

సీఎం మీద కామెంట్స్ చేసిన డీఈఈ సస్ఫెన్షన్

ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ అధినేత మీద వ్యాఖ్యలు చేసినందుకు ఓ సీనియర్ అధికారి పరిహారం చెల్లించుకున్నారు. సీఎంని కించపరుస్తూ వాట్సాప్ లో పోస్టులు పెట్టిన ఓ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సస్ఫెండ్ అయ్యారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌ లో డీఈఈగా ఉన్న కే విద్యాసాగర్ అనే అధికారి కొంతకాలంగా శృతి మించి వ్యవహరించడంతో చివరకు సస్ఫెన్షన్ వేటు పడినట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ కి ఎండీగా కూడా ఉన్న సీఐడీ చీఫ్‌ సునీల్ కుమార్ నిర్ధారించారు. సస్ఫెన్షన్ ఉత్తర్వులు విడుదల చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డి పై చేసిన అనుచితమైన పోస్ట్ లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణ, సెక్షన్ 25 ను ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసినట్లు మీడియా కి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఇఇ విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్ట్ చేసినట్టు తెలిపారు. పదే పదే వాటిని పునరావృతం చేసినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రిని అసభ్య భాషలో దూషించినట్టు తెలిపారు. ప్రభుత్వ విధానాలను తన వాట్సాప్ గ్రూపులలో విమర్శించినట్టు వివరించారు.

ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదులతో విచారణ సాగించినట్టు తెలిపారు. అందులో లో ఆధారాలతో సహా అన్నీ వాస్తవం అని తేలాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయనే విషయం విస్మరించకూడదన్నారు. వాటిని అతిక్రమిస్తే ఏపీ ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలను తీసుకోక తప్పదన్నారు. ఉద్యోగులంతా నిబంధనలు పాటించాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి