iDreamPost

కొత్త సినిమాలకు వాతావరణం దెబ్బ

కొత్త సినిమాలకు వాతావరణం దెబ్బ

నిన్న చాలా సినిమాలు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించింది. పేరుకి పదికి పైగానే విడుదలైనా జనాల దృష్టి పడిన వాటిలో ముఖచిత్రం ముందువరసలో ఉండగా పంచతంత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని నమ్ముకుని వీకెండ్ మీద ఆశలు పెట్టుకుంది. సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం పికపయ్యే సూచనలు కనిపించడం లేదు. పబ్లిసిటీ లోపం వల్ల విజయానంద్ ప్రేక్షకుల దాకా వెళ్లలేకపోయింది. లెహరాయి లాంటి వాటిని ఎవరూ పట్టించుకోలేదు. గత వారం రిలీజై నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేసిన హిట్ ది సెకండ్ కేస్ వీక్ డేస్ లో నెమ్మదించినా మళ్ళీ ఈ రెండు రోజుల వారాంతంలో పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అనూహ్యంగా మారిన వాతావరణం కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అవి లేకపోయినా చలి చంపేస్తోంది. నెల్లూరు, తిరుపతి లాంటి చోట్ల తుఫాను హెచ్చరికలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో పగలే స్వెట్టర్లు వేసుకుని తిరగాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో జనాల మూడ్ పెద్దగా సినిమాల వైపు వెళ్ళదు. సాయంత్రం, సెకండ్ షోలకు ఈ దెబ్బ తీవ్రంగా ఉంటుంది. అర్ధరాత్రి ఏసీ థియేటర్లో కూర్చుని చలికి వణుకుతూ ఇంటికి వచ్చే రిస్క్ చేయరు. పోనీ పెద్ద హీరోలవి ఆర్ఆర్ఆర్ లాంటివి ఉంటే ఏదో అనుకోవచ్చు కానీ ఉన్నవన్నీ చిన్నవే కావడం ఇబ్బంది పెడుతోంది

ఈ కొత్త రిలీజులు అన్నిటికీ మొదటి వారమే చాలా కీలకం. ఎందుకంటే ఇంకో ఆరు రోజుల్లో అవతార్ 2 వస్తోంది. దాని మీద ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో వేరే చెప్పనక్కర్లేదు. పేరుకి హాలీవుడ్ మూవీనే కానీ ఏబీసీ సెంటర్ అనే తేడా లేకుండా అత్యధిక స్క్రీన్లలో దీన్నే వేయబోతున్నారు. యూత్, పిల్లలే కాదు ఫ్యామిలీ జనాలు కూడా దీని మీద మంచి ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా దాని మీద దృష్టి మళ్లుతుంది. రేపు ఆదివారం ఏమైనా క్లైమేట్ సాధారణ స్థితికి వస్తే మంచిదే. లేదంటే సోమవారం నుంచి గురువారం వరకు కలెక్షన్లలో సహజంగా ఉండే డ్రాప్ ని తట్టుకుని వీలైనంత ఎక్కువ వసూలు చేసుకోవాలి. ప్రమోషన్ల వేగం పెంచాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి