iDreamPost

వర్షం నీళ్లలో స్పీడుగా కారు తోలేస్తున్నారా? ఈ వీడియో ఒక్కసారి చూడండి!

వర్షం నీళ్లలో స్పీడుగా కారు తోలేస్తున్నారా? ఈ వీడియో ఒక్కసారి చూడండి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పట్టిన ముసురు వదిలిందిలే అనుకునేలోపే.. మళ్లీ మూడ్రోజులు భారీ వర్షాలు చెప్పారు. వర్షాలు కురిసినా.. వరదలు వచ్చిన మన జీవితం మాత్రం ఆగదు. ఆఫీసులకు వెళ్లాల్సిందే.. ప్రయాణాలు చేయాల్సిందే. కొన్ని టూర్లను వాయిదా వేసినా కొన్నింటిని మాత్రం దాటవేయడం కుదరకపోవచ్చు. అయితే వర్షంలో ప్రయాణం అంటే అంత తేలిక కాదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఎంత ప్రమాదం జరుగుతుందో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఒక కారు రోడ్డుపై వేగంగా వస్తోంది. సాధారణంగా ఎవరైనా రోడ్డుపై వర్షపు నీరు కనిపించగానే.. నీళ్లలోకే పోనిస్తారు. చిన్నప్పటి నుంచి అందరికీ అదో సరదా. కానీ, ఆ సరదా మానుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే అలా రోడ్లపై ఉండే వర్షం నీటిలోకి వేగంగా వాహనాన్ని పోనివ్వడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ వైరల్ వీడియోలో కూడా అదే జరిగింది. ఒక బ్లూ కలర్ స్విఫ్ట్ కారు వేగంగా వస్తోంది. రోడ్డు మీద డివైడర్ వైపు నీళ్లు ఉన్నాయి. అదే వేగంలో డ్రైవర్ నీళ్లలోకి కారుని డ్రైవ్ చేశాడు. వెంటనే కారు రోడ్డుకి రెండో వైపుకు వెళ్లింది. కంట్రోల్ కాక వెంటనే పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ వీడియో షేర్ చేస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవేర్ నెస్ కలిగిస్తున్నారు. వర్షం నీటిలో డ్రైవ్ చేస్తే హైడ్రో ప్లానింగ్ కారణంగా ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

హైడ్రో ప్లానింగ్ అంటే ఏంటి?:

సాధారణంగా బైకు, కారు ఏదైనా రోడ్డుపై వెళ్తున్నప్పుడు టైరుకి రోడ్డుకి మధ్య ఒక ఫ్రిక్షన్ ఉంటుంది. రోడ్డు నుంచి టైరుకి ఒక గ్రిప్ వస్తుంది. దాని ద్వారా బండి వేగంగా వెళ్లినా కూడా స్కిడ్ కాకుండా, పడిపోకుండా ఉంటుంది. కానీ, వర్షం నీటిలో వాహనం నడపడం వల్ల.. టైరుకి రోడ్డుకి మధ్య నీటి పొర ఏర్పడుతుంది. దాని కారణంగా బండికి పట్టు దొరకదు. చాలా సులువుగా స్కిడ్ అవ్వడం, పల్టీలు కొట్టడం జరుగుతుంది. అలాంటి సమయంలో మీరు వేగంగా వెళ్తే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారచ్చు. ఇలా టైరుకి రోడ్డుకి మధ్య నీటి పొర ఏర్పడినప్పుడు ఈ హైడ్రో ప్లానింగ్ జరుగుతుంది. అందుకే వర్షపు నీటిలో నిదానంగా వాహనాన్ని నడపండి. ప్రమాదలను నివారించండి అంటూ సైబరాబాద్ పోలీసులు చైతన్యం కలిగిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి