iDreamPost

ఆర్‌బీఐ కార్యాలయం ఎదుట కరెన్సీ నోట్లు

ఆర్‌బీఐ కార్యాలయం ఎదుట కరెన్సీ నోట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఎదుట చెల్లాచెదురుగా కరెన్సీ నోట్లు కనిపించాయి. అయితే ఇవి పొరపాటుగా లేదా ఫేమస్ అయ్యేందుకు వీటిని ఇక్కడ పడేయలేదు. కొంత మంది వ్యక్తులు ఆగ్రహానికి గురై.. ఈ నోట్లను రోడ్ల మీద పడేశారు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. ఇంతకు నోట్లను విసిరేంత కోపం ఆ వ్యక్తులకు ఎందుకు వచ్చిందంటే..? చినిగిపోయిన, తడిసిన నోట్లను మార్చుకుని, నగదు పొందేందుకు ఆర్‌బీఐ అవకాశం కల్పిస్తున్న సంగతి విదితమే. అలా తమ వద్ద పాడైపోయిన నోట్లను తీసుకుని ఆర్‌బీఐ కార్యాలయానికి వచ్చారు కస్టమర్లు. అయితే ఆ నోట్లను మార్చుకోవడం లేదంటూ బ్యాంకు అధికారులు చెప్పడంతో తీవ్ర అసంతృప్తికి చెందిన కస్టమర్లు.. వాటిని అక్కడే విసిరేశారు.

తమ నోట్లను ఎందుకు మార్చుకోరంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రూ. 100, రూ.200, రూ.500 చినిగిన, పాడైపోయిన కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ ముందు విసిరేశారు. నిబంధనల ప్రకారం ఆర్‌బీఐ చిరిగిన నోట్లను మార్చుకోవాలని, అయితే అధికారులు మాత్రం ఖాతాదారులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర స్థానిక బ్యాంకులకు వెళ్లి మార్పిడి చేసుకోవాలని చెబుతున్నారని, కానీ బ్యాంకులు ఆ నోట్లను మార్చుకునేందుకు నిరాకరిస్తున్నాయని స్థానిక నివాసి దినేష్ కుమార్ సాహు తెలిపారు. అక్కడకు వెళితే.. ఇక్కడకు, ఇక్కడకు వెళితే అక్కడకు వెళ్లాలంటూ తిప్పించుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 3వ తేదీన నోట్లు మార్చుకునే కౌంటర్ మూసివేశారని, మమ్మల్ని బ్యాంకులోకి కూడా అనుమతించలేదని కస్టమర్లు పేర్కొన్నారు. చిరిగిన నోట్ల మార్పిడిని ఆపేస్తున్నట్లు సర్క్యులర్లు కూడా లేవని చెబుతున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా.. సమాచారం అందుకున్న ఖర్వేల్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆగ్రహంతో ఉన్న వినియోగదారుల్ని శాంతిపజేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ అంశంపై ఆర్‌బీఐ అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి