iDreamPost

థియేటర్లకొస్తున్న యూత్ ఫుల్ క్లాసిక్ ‘ ప్రేమ దేశం’

థియేటర్లకొస్తున్న యూత్ ఫుల్ క్లాసిక్ ‘ ప్రేమ దేశం’

కొన్ని క్లాసిక్స్ కి టైం లిమిట్ ఉండదు. ఎప్పుడు చూసినా ఒకే అనుభూతినిస్తాయి. అందులో ప్రేమ దేశం ఒకటి. 1996లో తమిళ నిర్మాత కెటి కుంజుమోన్ ఇద్దరు కుర్రాళ్లతో ఈ సినిమాని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నప్పుడు కోలీవుడ్ మొత్తం ఒకటే గుసగుస. మండే సూర్యుడు, జెంటిల్ మెన్ తో వచ్చిన లాభాలన్నీ కర్పూరమైపోతాయని కామెంట్లు. అందులోనూ కదిర్ అనే ఏ అనుభవం లేని ఒక కుర్రాడు చెప్పిన కథ విని ఇంత రిస్క్ కు సిద్ధపడటం చూసి స్టార్ హీరోలు సైతం అవాక్కయ్యారు. మోడలింగ్ చేసుకునే అబ్బాస్ అనే అబ్బాయిని అప్పుడప్పుడే కెరీర్ లో సెటిలవ్వడానికి ట్రై చేస్తున్న వినీత్ అనే అప్ కమింగ్ హీరోని తీసుకుని అన్నిటికి రెడీ అయ్యారు

మదరాసులో ప్రేమ దేశం కోసం వేసిన సెట్లు చూసేందుకు మీడియా ప్రత్యేకంగా వచ్చేది. ప్రముఖులు సందర్శించే వాళ్ళు. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రేమించడం, మధ్యలో ఒక పాశ్ విలన్, ఈ నలుగురి మధ్య జరిగే పరిణామాలు, కాలెజ్ స్టూడెంట్స్ గొడవలు, స్పోర్ట్స్ వగైరా బ్యాక్ డ్రాప్లో కదిర్ ఒక తపస్సులా దీన్ని రూపొందించాడు. ఏఅర్ రెహమాన్ ప్రాణం పోశాడనేది చిన్న మాటే అవుతుంది. కళాశాల విద్యార్థులు వెర్రెత్తిపోయేలా కంపోజ్ చేశాడు. ముస్తఫా ముస్తఫా పాట గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కాలేజీ స్టైలే, హలో డాక్టర్ లాంటి ఫాస్ట్ బీట్స్ తో పాటు వెన్నెల వెన్నెల లాంటి కూల్ మెలోడీస్ మ్యూజిక్ లవర్స్ ని వెంటాడాయి

ఇప్పుడీ యూత్ ఫుల్ మేజిక్ ఈ 9న మళ్ళీ థియేటర్లలో అడుగు పెట్టనుంది. అప్పట్లో యూత్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు మధ్య వయసు దాటేశారు. ఆ జ్ఞాపకాలను నెమరేసుకోవడంతో పాటు తమ పిల్లలకు ఆ ఎంజాయ్ మెంట్ తాలూకు జ్ఞాపకాలను మరోసారి దీని ద్వారా చూపించే అవకాశం దక్కనుంది. ప్రధాన కేంద్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఏఎంబి మాల్ లో మీడియాకు వేసిన ప్రీమియర్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ ఊపందుకున్న నేపథ్యంలో కొన్ని డిజాస్టర్లు సైతం థియేటర్లకు వచ్చాయి. వాటి సంగతేమో కానీ ప్రేమ దేశం లాంటి వాటిని మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. టైం మెషీన్ లో కాలేజీకి వెళ్లొచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి