iDreamPost

రెండేళ్ల బిడ్డతో సహా గోదావరిలోకి దూకేసిన దంపతులు

అందమైన జీవితం. అంతలోనే కుటుంబంలో సమస్యలు. అవి తీరేవి కావని, సొంత ఊరు వదిలి సిటీకి పయనం. కానీ వెళ్లిన మూడు నెలలకు ఊహించని విధంగా..

అందమైన జీవితం. అంతలోనే కుటుంబంలో సమస్యలు. అవి తీరేవి కావని, సొంత ఊరు వదిలి సిటీకి పయనం. కానీ వెళ్లిన మూడు నెలలకు ఊహించని విధంగా..

రెండేళ్ల బిడ్డతో సహా గోదావరిలోకి దూకేసిన దంపతులు

ఈ దంపతులకు ఐదేళ్ల క్రితం పెళ్లైంది. అన్యోన్యమైన దాంపత్యం, హాయిగా సాగిపోతున్న కాపురం. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బుజ్జి పాప పుట్టింది. అంతలో కుటుంబంలో అలజడి. సంపాదించిన సొమ్ము మొత్తం ఖర్చైంది. ఇక్కడ ఉంటే లాభం లేదనుకుని ఉపాధి కోసం సొంత ఊరిని వదిలేసి పట్టణానికి పరుగులు తీశారు. మూడు నెలల క్రితమే నగరానికి వచ్చి జీవిస్తున్నారు దంపతులు. ఏమైందో ఏమో తెలియదు బుధవారం సాయంత్రం తీవ్ర నిర్ణయం తీసుకుంది ఈ జంట. గోదావరి నదిలో దూకేసింది. రెండేళ్ల పసిబిడ్డతో సహా ముగ్గురు గోదాట్లోకి దూకారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. చేదోడు వాదోడుగా ఉన్న కుమారుడు చనిపోయాడని తెలిసే సరికి కన్నీటి పర్యంతం అవుతున్నారు.

పసిబిడ్డతో సహా నదిలోకి దూకేసిన ఈ ఘటన పశ్చిమ గోదావరిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం నెహ్రుకాలనీలో ఉండే బొంతు కిశోర్ కుమార్, యోచన భార్యా భర్తలు. వీరికి పెళ్లై ఐదేళ్లు అవుతుంది. రెండేళ్ల కూతురు శ్రీనిధి ఉంది. జీవనోపాధి కోసం అమలాపురంలో నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం యలమంచిలి మండలం చించినాడ గోదావరి వంతెనపై నుండి నదిలోకి దూకేశారు. కాగా, గురువారం గోదావరిలో బాడవ దగ్గర కిషోర్ కుమార్ మృతదేహం లభించింది. భార్య యోచన, కూతురు శ్రీనిధి గల్లంతు అయ్యారు. వీరి ఆచూకీ తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.

కాగా, సోదరుడు ఉదయ్ కిరణ్ చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. తండ్రి సత్యనారాయణ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, చికిత్స కోసం అప్పులు చేసినట్లు చెబుతున్నారు. దీంతో అన్నయ్య జీవనోపాధి కోసం మూడు నెలల క్రితం భీమవరం వీడి అమలాపురం వెళ్లారని చెబుతున్నారు. అందరితో కలివిడిగా ఉండేవాడని, ఎవరితోనూ గొడవ పడేవాడు కాదని పేర్కొన్నాడు. ఇప్పుడు అన్నయ్య చనిపోయిన వార్తను అనారోగ్యంతో ఉన్న తండ్రికి ఎలా చెప్పేది అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నాడు సోదరుడు. వదిన, పాప ఏమయ్యారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిశోర్ లేడన్న వార్త తెలిసి గ్రామస్థులు, బంధువులు కంటతడి పెట్టుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి