iDreamPost

ఈ ఐపీఎల్‌ను వెంటాడుతోంది..!

ఈ ఐపీఎల్‌ను వెంటాడుతోంది..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ను కూడా బెట్టింగ్‌ భూతం వీడడం లేదు. ఎదుటి వాడి ఆశే పెట్టుబడిగా సాగే ఈ బెట్టింగ్‌ క్రీనీడలో ఎన్నో కుటుంబాల ఆర్ధికంగా నాశనమవుతున్నాయి. మరెందరో అమాయకులు ప్రాణాలు తీసుకుంటున్న దారుణ పరిస్థితులు కూడా ఉభయతెలుగు రాష్ట్రాల్లోనూ లేకపోలేదు. ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలతో పోలీస్‌లకే సవాల్‌ విసురుతున్న ఈ బెట్టింగ్‌ రాయుళ్ళను నిరోధించడంపై వ్యవస్థలు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రస్తుత సీజన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లపై హైదరాబాదు కేంద్రం జరుగుతున్న బెట్టింగ్‌ ప్రక్రియను రాజస్థాన్‌ పోలీస్‌లు ఛేదించారు. గణేష్‌ అనే వ్యక్తి దేశంలోని దాదాపు ఆరు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ ముఠాలను ఏర్పాటు చేసి వారి ద్వారా కథనడిపిస్తున్నట్టు ఈ ఘటనలో బైటపడింది. ఇప్పుడు పట్టుబడ్డ ఏడుగురి నుంచి 16 కోట్ల రూపాయల వరకు నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు. వీరి నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టిన పోలీస్‌లు ఇప్పటి వరకు దొరికిన బెట్టింగ్‌ బృందాల్లో ఇదే పెద్దదిగా చెబుతున్నారు.

మెట్రో నగరాల నుంచి పల్లె ప్రాంతాల వరకు చాపకిందనీరులా విస్తరిస్తున్న ఈ బెట్టింగ్‌ బైటకు కన్పిస్తున్న దానికంటే ఎన్నో రెట్లు విస్తృతంగానే ఉంటుందంటున్నాయి పలు దర్యాప్తు సంస్థలు. ఫోన్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా కూడా ఈ తతంగం జరిగిపోతుండడం పట్ల పోలీస్‌లు తలలు పట్టుకుంటున్నారు. అంతా ఆన్‌లైన్‌ క్రమంలోనే జరుగుతున్న నేపథ్యంలో లోతైన దర్యాప్తు చేసి ఒక బుకీని పట్టుకునే ప్రయత్నంలో ఎక్కడైనా పోలీస్‌ల ప్రయత్నం విఫలమైపోయే అవకాశం ఉంటుంది.

ఒకరికొకరు ముఖ పరిచయం లేకపోయినప్పటికీ లక్షల్లోనే చేతులు మారే ఈ చీకటి వ్యవస్థను నడిపించే వ్యక్తులు బైట ప్రపంచానికి తెలియరంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం దొరుకుతున్న వారు కూడా ఈ వ్యవస్థలో ఉన్న మొత్తం వరుసక్రమంలో క్రిందిస్థాయివాళ్ళేనంటున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యవస్థలు సమగ్రంగా దృష్టిపెట్టి బెట్టింగ్‌ను రూపమాపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి