iDreamPost

అందుబాటులోకి బూస్టర్‌ డోస్‌.. ధర ఎంత అంటే..?

అందుబాటులోకి బూస్టర్‌ డోస్‌.. ధర ఎంత అంటే..?

మహమ్మారి కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో వరుస విరామంలో వ్యాక్సిన్‌ డోసులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు ఇప్పటికే తేల్చారు. ప్రారంభంలో రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంటే సరిపోతుందని అంచనా వేయగా.. ఆ తర్వాత బూస్టర్‌ డోసు కూడా తీసుకుంటే మంచిదంటూ నిపుణులు సూచించారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాక్సిన్‌ తీసుకుకోవడమే ప్రజల ముందున్న లక్ష్యం. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి వైరస్‌ సోకినా ప్రాణాపాయం తప్పుతోంది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత దాని ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుండడంతో వైద్య నిపుణులు బూస్టర్‌ డోసును సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఇంగ్లాడ్‌ వంటి దేశాల్లో ప్రజలకు బూస్టర్‌ డోసు ఇస్తున్నారు. మన దేశంలోనూ ఫ్రంట్‌లైన్‌వారియర్స్, 60 ఏళ్లు పైబడిన వారికి మూడో వేవ్‌ సమయంలో బూస్టర్‌ డోసు ఇచ్చారు.

అందుబాటులోకి బూస్టర్‌ డోసు..

కోవిడ్‌లో నూతన వేరియంట్లు వెలుగు చూస్తుండడం, ఇతర దేశాల్లో భారీగా కేసులు నమోదవుతుండడంతో దేశంలో నాలుగో వేవ్‌ వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సిన్‌ కావడంతో.. బూస్టర్‌ డోసుకు సిద్ధమైంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసును ప్రైవేటుగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్‌ డోసు అందుబాటులోకి రానుంది. ప్రైవేటు ఆస్పత్రులు, వ్యాక్సిన్‌ సెంటర్లలో నిర్ణయించిన నగదును చెల్లించి ప్రజలు బూస్టర్‌ డోసును తీసుకోవచ్చు. రెండో డోసు తీసుకుని 9 నెలలు గడిచిన వారు మాత్రమే ఈ బూస్టర్‌ డోసును తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిషీల్ట్‌ బూస్టర్‌ డోసు ధర 600 రూపాయలుగా తయారీ సంస్థ నిర్ణయించింది. కోవాక్సిన్‌ బూస్టర్‌ డోసు ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం త్వరలో అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

పూర్తి నియంత్రణలోకి కోవిడ్‌..

మూడో వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం తక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడలేదు. పైగా ఎంత వేగంగా వ్యాపించిందో.. అంతే వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ కేసులు వెయ్యికి లోపు మాత్రమే నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలలో కేసులు రెండంకెల సంఖ్యకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 8 మందికి మాత్రమే వైరస్‌ సోకడం.. కోవిడ్‌ వ్యాప్తి ఎంతమేర తగ్గిందో తెలుస్తోంది. అయితే నాలుగో వేవ్‌ వచ్చే ప్రమాదం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోసును అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి