iDreamPost

అలెర్ట్‌.. నాలుగో వేవ్‌ కూడా రాబోతుందట..!

అలెర్ట్‌.. నాలుగో వేవ్‌ కూడా రాబోతుందట..!

థర్ట్‌ వేవ్‌ తర్వాత దేశంలో కరోనా వైరస్‌కు ఇక కాలం చెల్లిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో నిపుణుల అంచనాలు సరికొత్త ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. కరోనా వైరస్‌ ఇంకా పూర్తిగా పోలేదని, కొత్త వేరియంట్‌లు పుట్టే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే నాలుగో వేవ్‌ వస్తుందని ఊహిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో నాలుగో వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని ఐఐటీ ఖరగ్‌పూర్‌ అంచనా వేసింది. జూన్‌ 22న నాలుగో వేవ్‌ ప్రారంభం అవుతుందని, ఆగష్టు చివరినాటికి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని, అక్టోబర్‌ ఆఖరునకు ముగిసిపోతుందని అంచనా వేసింది.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నా.. ఊరటనిచ్చే అంశం కూడా ఒకటి ఉంది. నాలుగో వేవ్‌ వచ్చే అవకాశం కరోనా వ్యాక్సినేషన్, కరోనా కొత్త వేరియంట్ల పుట్టుకపై ఆధారపడి ఉంటుందట. వ్యాక్సిన్‌ రెండు డోసులు పూర్తిగా తీసుకోవడం వైరస్‌ను అరికట్టేందుకు ఉపయోగపడనుంది. అదే సమయంలో కొత్త వేరియంట్‌ పుట్టకపోతే.. నాలుగో వేవ్‌కు అవకాశం లేదని ఐఐటీ ఖరగ్‌పూర్‌ చెబుతోంది.

దేశంలో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దాదాపు పూర్తవ్వొచ్చింది. మొదటి డోసు తీసుకున్న వారు దాదాపు వంద శాతం ఉన్నారు. రెండో డోసు తీసుకున్న వారు 85 శాతంపైగా ఉన్నారు. 15 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ ఇచ్చారు. పెద్దలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి బూస్టర్‌ డోసు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. ఇటీవల వచ్చిన మూడో వేవ్‌ సమయంలోనే బూస్టర్‌ డోసును పంపిణీ చేయడం ప్రారంభించారు.

అయితే కరోనాతో సహజీవనం తప్పదని నిపుణులు మొదటి వేవ్‌ తర్వాత హెచ్చరించారు. వైరస్‌ మనల్ని వదలిపోదని, అయితే దాని ప్రభావం తగ్గుతుందని పేర్కొన్నారు. నిపుణులు ఊహించనట్లుగానే వైరస్‌ రూపం మారినప్పుడల్లా.. దాని తీవ్రత తగ్గుతోంది. మొదటి, రెండో వేవ్‌లలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరణాలు ఎక్కువగా సంభవించాయి. 4 లక్షలకుపైగా మరణాలు నమోదయ్యాయి. ఇక థర్ట్‌ వేవ్‌లో వచ్చిన ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉండడంతో.. మరణాలు తక్కువగా సంభవించాయి. ఆస్పత్రికి వెళ్లే అవసరం కూడా తగ్గిపోయింది. వైరస్‌ సోకిన వారు గరిష్టంగా ఐదు రోజుల్లోనే కోలుకున్నారు.

అయితే గత గణాంకాలు, పరిస్థితులు ఎలా ఉన్నా.. నాలుగో వేవ్‌ రాదని అనుకునేందుకు అవకాశం లేదు. ఇప్పటివరకు నిపుణులు వేసిన అంచనాలు నిజమయ్యాయి. కొత్త వేరియంట్‌ ప్రపంచంలో ఎక్కడ పుట్టినా..అది విశ్వం అంతా వ్యాపిస్తుంది. కొత్త వేరియంట్‌ పుట్టకపోతే.. నాలుగో వేవ్‌ రానట్టే.

ప్రస్తుతం మన దేశంలో రోజు వారీ కరోనా కేసులు 10 వేల దిగువకు పడిపోయాయి. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య 8–9 వేల మధ్యన నమోదవుతోంది. ఇప్పటివరకు 5.19 లక్షలమంది కరోనా వైరస్‌ వల్ల మరణించారు. ఇవి అధికారిక గణాంకాలు మాత్రమే. వైరస్‌ బారిన పడినవారు, మరణాల లెక్కలు.. అనధికారికంగా పలు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి