iDreamPost

కరోనా దెబ్బకు క్రీడాలోకం కకావికలం- కోలుకోవడం ఎలా

కరోనా దెబ్బకు క్రీడాలోకం కకావికలం- కోలుకోవడం ఎలా

కరోనా తాకిడి అన్ని రంగాలను తల్లడిల్లిపోయేలా చేస్తోంది. వైరస్ వ్యాప్తితో విశ్వమంతా వణికిపోతున్న తరుణంలో క్రీడాలోకం కూడా కకావికలం అవుతోంది. అన్ని ఆటల్లోనూ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. షెడ్యూల్స్ సవరించుకోవాల్సిన పరిస్థితి సర్వాత్ర ఉంది. దాంతో అన్ని ఆటలకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారుతోంది. క్రీడా ప్రపంచం ఎప్పటికి కోలుకునేది తెలియక తలలు పట్టుకుంటున్నారు. అటు క్రీడా సంఘాలు, ఇటు క్రీడాకారులు కూడా ఇదే సమస్యతో సతమతం అవుతున్నారు.

ప్రపంచంలో అత్యధికంగా అభిమానించే ఆటల్లో ఫుట్ బాల్, క్రికెట్, టెన్నీస్ వంటివి ప్రధానమైనవి. వాటితో పాటుగా అందరి దృష్టిని ఆకర్షించే విశ్వక్రీడలు ఒలింపిక్స్ కూడా ఇంకా ఊగిసలాటలో ఉంది. ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ని వచ్చే ఏడాదికి మారుస్తూ ఇప్పటికే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్ణయించింది. కానీ వచ్చే ఏడాది కూడా పోటీలు జరిగే అవకాశం ఉంటుందా లేదా అన్నది ఐఓసీ కూడా అంతుబట్టడం లేదు. వైరస్ కంట్రోల్ కాకపోతే ఇక వచ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ నిర్వహించగలమని నమ్మకం కనిపించడం లేదని భావిస్తున్నారు. అదే జరిగితే జపాన్ ప్రభుత్వంతో పాటుగా ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తయిన తర్వాత చివరి నిమిషంలో వాయిదాపడడంతో వారికి పెద్ద భారంగా మారింది.

ఆ తర్వాత సాకర్ లీగ్స్ కి సంబంధించి అన్నీ నిలిచిపోయాయి. ప్రధానంగా యూరప్, అమెరికాలలో ఉన్న పరిస్థితులు రీత్యా మళ్లీ పుట్ బాల్ గ్రౌండ్స్ లో కళకళలాడుతాయనే ధీమా కనిపించడం లేదు. లక్షల మంది అభిమానులతో నిండిపోయే గ్రౌండ్స్ లో తొక్కిసలాట కూడా జరిగిన అనేక ఘటనలున్నాయి. అలాంటి గ్రౌండ్స్ అన్నీ ఇప్పటికే రెండు నెలలుగా ఖాళీగా ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకూ అదే పరిస్థితి. ఆ తర్వాత కూడా సాధారణ పరిస్థితి వస్తుందా రాదా అన్నది సందేహంగా చెప్పవచ్చు. దాంతో క్లబ్బులు కష్టాలు పెరుగుతున్నాయి. ఖరీదైన ఆటగాళ్లను కొనుగోలు చేసిన వారికి కూడా పెద్ద భారంగా మారుతున్నట్టు చెప్పవచ్చు.

ఇక టెన్నీస్ లో ఇప్పటికే గ్రాండ్ స్లామ్ గగనంగా మారుతోంది. ఈ ఏడాదికి సంబంధించి ఆస్ల్రేలియన్ ఓపెన్ జరిగింది. కానీ ఫ్రెంచ్ ఓపెన్ రద్దు చేశారు. వింబుల్డన్ కి అవకాశం లేకుండా పోయింది. ఇక యూఎస్ ఓపెన్ కూడా జరిగే అవకాశం అగమ్యగోచరంగా కనిపిస్తోంది. దాంతో ఆయా టోర్నీల నిర్వాహకులకు తీవ్ర నష్టాలు తప్పవని భావిస్తున్నారు. ముఖ్యంగా స్పాన్సర్స్ నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడం, మరోవైపు మళ్లీ ఎప్పటికీ పోటీలు జరుగుతాయా అనేది అంతుబట్టకపోవడం వారిని సతమతం చేస్తోంది.

ఇక ఇండియాలో మతాలు, కులాల కన్నా అందరినీ కలిపే సాధనంగా ఉన్న క్రికెట్ కూడా వెంటనే కోలుకునే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా కీలక సిరీస్ లో నిలిచిపోయాయి. టీ20 వరల్డ్ కప్ నిర్వహణ కష్టంగా మారింది. ఆతర్వాత ఆస్ట్రేలియా టీమిండియా సిరీస్ కూడా కష్టమేననే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే అభిమానులు లేకుండా కేవలం ఆటగాళ్లతో మ్యాచ్ లు నిర్వహించాలనే ప్రతిపాదన చేశారు. అది ఫలితాన్నిస్తుందా లేదా అన్నది మాత్రం క్రికెట్ బోర్డులకు బోధపడడం లేదు. ఇప్పటికే ఈ పరిణామాలతో పలు క్రికెట్ బోర్డులు దివాళా తీస్తున్నాయి. వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, సౌతాఫ్రికా బోర్డులకు చిక్కులు తప్పేలా లేవు. ఇప్పటికే జింబాబ్వే వంటి క్రికెట్ బోర్డులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయి. ఐపీఎల్ రద్దుతో బీసీసీఐ ఆదాయానికి కూడా పెద్ద గండిపడింది.

కరోనా కారణంగా ఆదాయాలు పడిపోవడం ఒకటయితే, మరోవైపు ఆటగాళ్లకు ఫిట్ నెస్ సమస్యలు కూడా తప్పేలా లేవు. షెడ్యూళ్లన్నీ తారుమారయిన తరుణంలో పూర్వ వైభవం అందుకునేందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు పాటించడం వారికి భారంగా మారుతోంది. నెలల తరబడి మైదానాలకు దూరంగా ఉంటే ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నది వారిని ఆందోళనకు గురిచేస్తోంది. దాంతో అటు శారీరకంగానూ, ఇటు ఆర్థికంగానూ కోవిడ్ 19 మూలంగా ఎదురవుతున్న పరిస్థితులను ఎదుర్కోవడం ఇప్పుడు క్రీడాలోకానికి పెద్ద సమస్యగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి