iDreamPost

తగ్గుతున్న యాక్టివ్‌ కేసులు

తగ్గుతున్న యాక్టివ్‌ కేసులు

ఏపీలో కోవిడ్‌ 19 యాక్టివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్‌ను బట్టి తెలుస్తోంది. ఒక దశలో లక్షకు చేరువగా యాక్టివ్‌ కేసులు చేరుకున్నాయి. అయితే ఇప్పుడవి 59వేలకు అటూ ఇటూగా కొనసాగుతున్నాయి. అంటే దాదాపు సగం వరకు యాక్టివ్‌ కేసులు తగ్గినట్టేనని భావించొచ్చు. మరో వైపు విస్తృతంగా చేపడుతున్న వైద్య పరీక్షల్లో బైటపడుతన్న పాజిటివ్‌ల సంఖ్య కూడా గత అయిదార్రోజులుగా తగ్గుతోంది. మరో వైపు కోలుకుని ఇళ్ళకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఇప్పటి వరకు చేసిన వైద్య పరీక్షల్లో మొత్తం 6,22,136 మంది పాజిటివ్‌గా తేలారు. వీరిలో 59,435 మంది మాత్రమే యాక్టివ్‌ కేసులుగా ఉన్నారు. మిగిలిన వారు ట్రీట్‌మెంట్‌ అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ప్రభుత్వ బులిటెన్‌లో పేర్కొన్నారు. కోవిడ్‌ కారణంగా ఇప్పటి వరకు 5,780 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరువేల కేసులకు పైగా మాత్రమే నమోదయ్యాయి. ఇది ఆనందించదగ్గ పరిణామమేని వైద్య బృందాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఆగష్టు–సెప్టెంబరు నెలల మధ్య దేశ వ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వేలెన్స్‌ సర్వే ప్రకారం దేశంలోని యువజనుల్లో 7.1 శాతం మంది కోవిడ్‌ వైరస్‌ భారిన పడ్డారని అంచనా వేస్తున్నారు. కరోనా ప్రభావం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే అధికంగా ఉన్నట్లు సర్వే నివేదికలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించింది. వైరస్‌ సంక్రమణను అడ్డుకునే హెర్డ్‌ ఇమ్యూనిటీ స్థాయి ఇంకా దేశంలోని జనాభాలో పెరగలేదని గుర్తించారు. అందు వల్ల ఇంకా వైరస్‌ భారిన పడేందుకు ఎక్కువ శాతం మంది ప్రజలకు అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాల్సిందేనని నొక్కి చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి