iDreamPost

రాజీనామా యోచ‌న‌లో ఇద్ద‌రు మంత్రులు

రాజీనామా యోచ‌న‌లో ఇద్ద‌రు మంత్రులు

విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త కోసమే రాజ‌కీయాలు చేస్తున్నాన‌ని చెబుతున్న జ‌గ‌న్ అందుకు అనుగుణంగానే మండ‌లి వ్య‌వ‌హారంలో ముందుకు సాగుతున్న‌ట్టు చెప్పుకున్నారు. ముఖ్యంగా రాయ‌బేరాలు సాగుతున్న‌ట్టు కొన్ని ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై మండిప‌డ్డారు. 5 కోట్లు ఆఫ‌ర్ చేస్తున్నార‌ని రాసిన రాత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. త‌మ‌కు అలాంటి అవ‌స‌రం లేద‌ని, తాను త‌ల‌చుకుంటే చంద్ర‌బాబుకి విప‌క్ష హోదాకి కూడా మిగ‌ల‌దంటూ పున‌రుద్ఘాటించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మండ‌లి ర‌ద్దుకి ఏక‌గ్రీవంగా ఆమోదించిన పాల‌క‌పార్టీ త‌రుపున శాస‌న‌మండ‌లి నుంచి క్యాబినెట్ కి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఇద్ద‌రు మంత్రుల తీరు మీద చ‌ర్చ సాగుతోంది. అసెంబ్లీ చ‌ర్చ‌లో ఇద్ద‌రు మంత్రులు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ కూడా జ‌గ‌న్ నిర్ణ‌యానికి జై కొట్టారు. మండ‌లి ర‌ద్దు ఆవ‌శ్యాన్ని వ్య‌క్తం చేశారు.

Read Also: ఇద్ద‌రు మంత్రులు భవిషత్తు ?

మండ‌లి ర‌ద్దు తీర్మానం వెలువ‌డిన‌ప్ప‌టికీ అది అమ‌లులోకి రావ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అధికారికంగా పార్ల‌మెంట్, రాష్ట్ర‌ప‌తి నుంచి ఆమోద‌ముద్ర ప‌డేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంద‌న్న‌ది అంతుబ‌ట్ట‌ని విష‌యంగా మారింది. అది పూర్తిగా బీజేపీ పెద్ద‌ల ఇష్టాయిష్టాల మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌న‌డం కాద‌న‌లేని స‌త్యం. దాంతో మోడీ-షా వ్య‌వ‌హారం మీదే ఏపీ మండ‌లి భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మండ‌లి ర‌ద్దు చేయాల‌నే సంకల్పంతో ముంద‌డుగు వేసిన జ‌గ‌న్ అందుకు త‌గ్గ‌ట్టుగానే నైతికంగా త‌న ఇద్ద‌రు మంత్రుల‌తో రాజీనామా చేయించాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్టు రాజ‌కీయా వ‌ర్గాల్లో ప్ర‌చారం మొద‌ల‌య్యింది. దానికి ఆ ఇద్ద‌రు మంత్రులు కూడా సంసిద్ధంగా ఉన్న‌ట్టు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మి పాల‌యిన ఈ ఇద్ద‌రినీ క్యాబినెట్ లో తీసుకోవ‌డం ద్వారా జ‌గ‌న్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. పార్టీ ప‌ట్ల ఆ ఇద్ద‌రి నేత‌ల అంకిత‌భావానికి జ‌గ‌న్ ఇచ్చిన గుర్తింపుగా భావించారు. ఇక ఇప్పుడు కూడా అధినేత నిర్ణ‌యంతో వారిద్ద‌రూ సంపూర్ణంగా ఏకీభ‌విస్తున్న త‌రుణంలో రాజీనామా అస్త్రాలు సంధించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ ఎప్ప‌టికి పూర్త‌వుతుంద‌న్న‌ది స్ప‌ష్టత లేదు. అదే స‌మ‌యంలో ర‌ద్ద‌యిన‌ప్ప‌టికీ ఆరు నెల‌ల పాటు వారి ప‌ద‌వుల‌కు ఢోకా లేదు. ఏ స‌భ‌లోనూ స‌భ్యుడు కాని వారు ఆరు నెల‌ల పాటు మంత్రివ‌ర్గంలో కొన‌సాగే అవ‌కాశం ఉన్న త‌రుణంలో అలాంటి అవ‌కాశాల‌ను కాద‌ని, రాజీనామా చేస్తారా లేక ఇంకా వేచి చూస్తారా అన్న‌ది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రం అవుతోంది.

Read Also: పార్టీల్లో ఉన్న స్వతంత్ర సమరయోధులకు ఫించన్ ఇవ్వాల్సిందే…

రాజ‌కీయంగా విప‌క్షాన్ని ఇర‌కాటంలో పెట్ట‌డం, తాను చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డ‌డం అనే రెండు అంశాల్లో స్ప‌ష్ట‌త కోస‌మే రాజీనామా వ్య‌వ‌హారం వైసీపీ తెర‌మీద‌కు తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అందుకు తోడుగా రాజీనామా చేసిన‌ప్ప‌టికీ ఇద్ద‌రు నేత‌ల‌కు త‌గిన గుర్తింపు ఖాయ‌మ‌నే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా తొలివిడ‌త‌లోనే పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ ని రాజ్య‌స‌భ‌కు పంపించే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ ఉన్న‌ట్టు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా ఆయ‌న‌కు హామీ ద‌క్కిన‌ట్టు స‌మాచారం. అదే జ‌రిగితే తన‌ను న‌మ్మిన వారి కోసం ఏద‌యినా చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌నే ముద్ర ఉన్న వైఎస్సార్ బాట‌లోనే జ‌గ‌న్ సాగుతున్న‌ట్టుగా పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెరిగేందుకు దోహ‌దప‌డుతుంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. ఇక మోపిదేవికి ఎలాంటి హోదా ద‌క్కుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారుతోంది. అందుకు ముందుగా మంత్రుల రాజీనామాల విష‌యంలో అధికార వైసీపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి