iDreamPost

ఇంగ్లండ్‌ను అడ్డుకోవాలంటే ఇండియా ఏం చేయాలి?

ఇంగ్లండ్‌ను అడ్డుకోవాలంటే ఇండియా ఏం చేయాలి?

నూట పంతొమ్మిది పరుగులు. ఇంగ్లాండ్ గెల‌వాలంటే సాధించాల్సిన ర‌న్స్. ఇప్పుడున్న ఊపును చూస్తుంటే 25 ఓవ‌ర్ల‌లోనే గెల‌వొచ్చు. నాలుగు, ఐదు రోజుల పిచ్ మీద‌ సాధించడం కష్టమని భావించిన లక్ష్యాన్ని, ఇంగ్లండ్‌ బుల్‌డోజ్‌ చేసింది. వందల ఏళ్ల టెస్టు క్రికెట్‌, 378ర‌న్స్ ను నాలుగో ఇన్నింగ్స్ లో సాధించ‌డం అసాధ్య‌మ‌నే చెబుతోంది. ఫ‌స్ట్ బాల్ నుంచి కామెంటేట‌ర్లు ఇదే చెబుతున్నారు. టీం ఇండియాకూడా అదే న‌మ్మ‌కంతో బౌలింగ్ మొద‌లుపెట్టింది. అక్క‌డ నుంచి ప‌రిస్థితి నెమ్మ‌దిగా అందరికీ అర్ధమ‌వుతోంది. ఇది యేడాది క్రితం నాటి ఇంగ్లాండ్ జ‌ట్టుకాదు. బాజ్‌బాల్ వ్యూహం. అంటే మొద‌టి బాల్ నుంచే దంచికొట్ట‌డం. బౌల‌ర్ ఎవ‌రైతేనేం, కొట్ట‌గ‌లిగే ప్లేస్ లో బాల్ ప‌డిందంటే బౌండ‌రీ దాటాల్సిందే. దీంతో మరోసారి ఇంగ్లండ్ జట్టుపై అందరికీ నమ్మకం వ‌చ్చింది.

నాలుగో రోజు ఆట‌ముగిసే స‌రికి ఇంగ్లాండ్ మూడు వికెట్ల‌కు 259 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యం 378 ర‌న్స్. ఇంకో రోజు ఉంది. కొట్టాల్సిన ర‌న్స్ ఇంకా 119. జో రూట్ 76తో, జానీ బెయిర్ స్టో 72 ర‌న్స్ తో క్రీజులో ఉన్నారు. ఇన్సింగ్స్ ర‌న్ రేటు 4.54. ఈ ఇద్ద‌రు క‌ల‌సి 32.5 ఓవ‌ర్ల‌లో 150 ర‌న్స్ కొట్టేశారు. అంటే ఇది టెస్ట్ క్రికెట్ అనుకోవాలా? వ‌న్డే త‌ర‌హా అట‌తీరు అనుకోవాలా?


ఇప్ప‌టిదాకా నాలుగో ఇన్సింగ్స్ అంటే బ్యాట్సెమెన్ ల‌కు బెదురు. బౌల‌ర్లు చెల‌రేగిపోతారు. పిచ్ లో ప‌గుళ్లు వ‌చ్చి, బాల్ ఎటు వెళ్తుందో అర్ధంకాదు. అలాంటి పిచ్ మీద, ఇండియా బెస్ట్ బౌలింగ్ ఎటాక్ మీద ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు చెల‌రేగిపోతున్నారు.

ఈ వేసవిలో నాలుగో ఇన్నింగ్స్ ఛేజింగ్‌లలో ఇంగ్లండ్ అన్ని జ‌ట్లు క‌ల‌లుగ‌నే విజ‌యాల‌ను సాధిస్తోంది. 378 పరుగుల ల‌క్ష్యం కోసం 3 వికెట్లకు 259 పరుగులు సాధించారు. మిగిలిన ర‌న్స్ ను సాధిస్తే ఇదో రికార్డ్ ఛేజింగ్. నిజానికి, ఇన్సింగ్స్ మ‌ధ్య‌లో రెండు పరుగులకే మూడు వికెట్లు ప‌డ్డాయి. ఇంగ్లాండ్ కుప్ప‌కూలుతుంద‌న్న వేళ, జో రూట్- జానీ బెయిర్‌స్టో వెన్నుముక‌లా నిల‌బ‌డ్డారు.


అంత‌కుముందు అలెక్స్ లీస్- జాక్ క్రాలే టెస్ట్ క్రికెట్ ను టీ20 త‌ర‌హాలో మొద‌లుపెట్టారు. ఇంగ్లాండ్ త‌రుపున‌ వేగవంతమైన వంద పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. టెస్ట్ ను గెలిచే ప‌రిస్థితిలో నిల‌బెట్టారు. నిజానికి ఈ ఘ‌న‌త ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ది. ఓవర్‌నైట్‌లో 257 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్ మొద‌లుపెట్టిన ఇండియాను అడ్డుకున్నారు. 120 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశారు. ఇప్పుడు ఆ వంతు ఇండ‌య‌న్ బౌల‌ర్ల‌ది. ఇంగ్లాండ్ ను అడ్డుకోగ‌ల‌రా? నిజానికి మొద‌టి మూడురోజులు ఇండియాదే పైచేయి. నాలుగో రోజునుంచి ఇంగ్లాండ్ బౌల‌ర్లు, బ్యాట్సెమెన్ చెల‌రేగిపోతున్నారు. ఐదో రోజు మొద‌టి సెష‌న్స్ లోనే వికెట్లు ప‌డ‌గొట్ట‌క‌పోతే ఇంగ్లాండ్ దూకుడును ఆప‌డం క‌ష్టం.

ఇండియా రెండో ఇన్సింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలింగ్ చేస్తున్న‌ప్పుడు బంతి బాగా బౌన్స్ అయ్యింది. బ్యాట్స్ మేన్ ను క‌న్ఫ్యూజ్ చేసింది. అందుకే స్సిన్న‌ర్ జాక్ లీచ్ ను ఆడ‌టానికి ఇండియ‌న్ బ్యాట్సెమెన్ ఇబ్బంది ప‌డ్డారు. ఇదీ 12-1-28-1 లీచ్ బౌలింగ్ విశ్లేష‌ణ‌. రిషబ్ పంత్ వికెట్ పడగొట్టాడు. విదేశీ గ‌డ్డ‌మీద ఒకే టెస్టులో సెంచరీ, ఫిఫ్టీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.

నాలుగో ఇన్సింగ్ లో ఇండియా బౌల‌ర్ల‌కు బంతిమీద ప‌ట్టు దొర‌క‌లేదు. 21వ ఓవర్‌లో బాల్ ని మార్చిన‌ప్పుడు మాత్రం, టపాట‌పామ‌ని మూడు వికెట్లు ప‌డ్డాయి. బౌల‌ర్ల దెబ్బ‌కు రూట్, బెయిర్‌స్టో రివర్సింగ్ బాల్‌కు జాగ్ర‌త్త‌గా ఆడారు. అలా కాని ప‌క్షంలో మాత్రం గ‌ట్టిగా బాదారు. ఇద్ద‌రూ క‌ల‌సి ఇప్పటికీ ఓవర్‌కి 4.56 ర‌న్ రేట్ తో 150 పరుగులు సాధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి