iDreamPost

రాజకీయ వైరస్ గా మారిన క‌రోనా

రాజకీయ వైరస్ గా మారిన  క‌రోనా

ప్రపంచంలో స‌గం మంది లాక్ డౌన్ లో ఉన్నారు. కరోనా తాకిడికి త‌ల్ల‌డిల్లిపోతూ ఏం చేయాలో పాలుపోకి త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కానీ ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ నేత‌లు మాత్రం దానికి భిన్నం. అందులో ప్ర‌తిప‌క్ష టీడీపీ తీరు మ‌రింత విడ్డూరంగా, విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది. సీనియ‌ర్ రాజ‌కీయ నేత నేనేన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు అయితే హైద‌రాబాద్ లో ఉంటూ ఆంధ్రప్ర‌దేశ్ లో సృష్టిస్తున్న అల‌జ‌డి ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఆందోళ‌న‌కు కూడా గురిచేస్తోంది. ప్రపంచాన్ని క‌ట్ట‌డి చేసిన క‌రోనా చంద్ర‌బాబుని ఏమీ చేయ‌లేక‌పోతుందా అనే సందేహం క‌లుగుతుంది. రాజ‌కీయాల‌కు చాలా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడే సంయ‌మ‌నం కోల్పోయి ఏపీ ప్ర‌భుత్వాన్ని బద్నాం చేసే పనికి బ‌రితెగిస్తున్న తీరు బాహాటంగా క‌నిపిస్తోంది. క‌రోనా స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు త‌గిన స‌హ‌కారం అందించాల్సిన స‌మ‌యంలో దానికి విరుద్ధంగా వాటిని అడ్డుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు సామాన్యుల‌ను కూడా క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి.

విప‌త్తుల వేళ ఏ ప్ర‌భుత్వం అయినా ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌ర‌చాలంటే అది చిన్న విష‌యం కాదు. అనేక వ‌ర‌ద‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చేసిన తీరు అందుకు ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌చార‌హోరుతో ఎంత‌గా క‌ప్పిపుచ్చ‌లాని చూసినా ప్ర‌జ‌ల ఆందోళ‌న బ‌య‌ట‌ప‌డిన తీరు ఆయ‌న‌కు బాగా ఎరుకే. అలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం శ‌క్తిమేర‌కు ప్ర‌య‌త్నించి సామాన్యుడికి చేదోడుగా ఉండాలి. విప‌క్షాలు దానికి తోడ్ప‌డాలి. విప‌త్తు వైదొలిగిన త‌ర్వాత ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను వేలెత్తి చూపించి, ప్ర‌త్యామ్నాయంగా మంచి సూచ‌న‌లు వెల్ల‌డించే అవ‌కాశం ప్ర‌తిప‌క్షానికి ఎప్పుడూ ఉంటుంది. కానీ క‌రోనా స‌మ‌స్య‌లు, లాక్ డౌన్ ఇబ్బందుల్లో జ‌న‌మంతా ఉంటే చంద్ర‌బాబు మాత్రం ఇప్పుడే మొత్తం రాజ‌కీయాలు చేసేందుకు స‌మాయ‌త్వం కావ‌డం రాజ‌కీయాల‌ను దిగ‌జారుస్తున్న తీరుకి ద‌ర్ప‌ణం ప‌డుతుంది.

చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్ త‌గిన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తే జ‌నం హ‌ర్షిస్తారు. మంచి సూచ‌న‌లు పాటించ‌క‌పోతే ప్ర‌భుత్వాన్ని వేలెత్తిచూపుతారు. రాజ‌కీయంగా అది చంద్ర‌బాబుకే ఉప‌యోగ‌ప‌డుతుంది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా సూచ‌న‌ల‌కు బ‌దులుగా స‌ర్కారు చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌డ‌మే త‌న ల‌క్ష్యం అన్న‌ట్టు సాగుతున్నారు. అనుభ‌వ‌శీలి అని చెప్పుకుంటూ అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో ఎవ‌రికైనా స‌మ‌స్య వ‌స్తే ఆదుకోవాలి..ఆప‌న్న హ‌స్తం అందించేందుకు తోడ్ప‌డాలి. కానీ టీడీపీ నేత‌లు మాత్రం ఆందోళ‌న‌కు దిగుతున్నారు. భౌతిక‌దూరం పాటించి, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌పంచం అంతా చెబుతుంటే పాల‌కొల్లు టీడీపీ ఎమ్మెల్యే మాత్రం త‌గుదున‌మ్మా అంటూ సైకిల్ యాత్ర‌కు బ‌య‌లుదేరారు. అందుకు ఆయ‌న చెబుతున్న కార‌ణం కూడా క‌లెక్ట‌ర్ త‌న ఫోన్ లిఫ్ట్ చేయ‌లేద‌ని. అస‌లు క‌లెక్ట‌ర్ గానీ ఇత‌ర అధికారులు గానీ ఇప్పుడు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి మామూలుగా లేదు.

అలాంటి స‌మ‌యంలో రాజ‌కీయ ల‌క్ష్యాల‌తో విసుగెత్తించ‌డం భావ్య‌మా అన్న‌ది ప్ర‌తిప‌క్షానికే తెలియాలి. పైగా ఎమ్మెల్యే చెప్పిన‌ట్టుగా ఫలానా రైతుల ద‌గ్గ‌ర రొయ్య‌ల‌న్నీ కొనుగోలు చేయాలంటే ఇప్పుడు సాధ్యం కాదు. అయిన‌ప్ప‌టికీ త‌న మాట విన‌క‌పోతే క‌రోనాని కూడా ఖాత‌రు చేయ‌కుండా రోడ్డెక్కుతాన‌ని ఎమ్మెల్యే సిద్ధ‌ప‌డిపోయారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా స్పందించే రీతిలోనే పోలీసులు ఆయ‌న్ని వారించారు. వారితో వాగ్వాదానికి దిగి, నానాయాగీ చేసిన తీరు చూస్తుంటే రాజ‌కీయాలే త‌ప్ప సామాన్యుల గోడు టీడీపీకి ప‌ట్ట‌దని అర్థం అవుతోంది. మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతున్న వేళ కొంత స‌హ‌నం పాటించాల్సిన ఎమ్మెల్యే ఎలానూ గీత దాటేశారు. దానికి చంద్ర‌బాబు వంత‌పాడ‌డం మ‌రో విచిత్రం క‌దా. ఓవైపు ల‌క్ష‌ణ‌రేఖ దాట‌వ‌ద్ద‌ని..అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప రోడ్డు మీద‌కు రావ‌ద్ద‌ని ప్ర‌ధాని చెప్పిన మాట‌ల‌ను పాటించాల‌ని చెబుతున్న చంద్ర‌బాబు, క‌లెక్ట‌ర్ ఫోన్ ఎత్త‌డం లేద‌ని రోడ్డెక్కిన ఎమ్మెల్యేని ఎలా స‌మ‌ర్థిస్తారని అనుమానం రావ‌చ్చు. కానీ చంద్ర‌బాబు స‌మ‌ర్థించ‌డం మాత్ర‌మే కాదు..మా ఎమ్మెల్యేను ఎలా అడ్డుకుంటారు..ఆయ‌న పాల‌కొల్లు నుంచి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఏలూరు వ‌ర‌కూ సైకిల్ యాత్ర చేయ‌నివ్వాలి క‌దా అంటూ ఏకంగా గ‌వ‌ర్న‌ర్ కి ఫిర్యాదు చేశారు.

కేవ‌లం నిమ్మ‌ల రామ‌నాయుడు వ్య‌వ‌హారం మాత్ర‌మే కాదు..న‌ర్సీప‌ట్నం ఆస్ప‌త్రి వ్య‌వ‌హారం, అంత‌కుముందు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హాయ పంపిణీలో రాజ‌కీయం, చివ‌ర‌కు తెలంగాణా నుంచి ఏపీకి వ‌స్తున్న వారంద‌రినీ అనుమ‌తించాల‌ని డిమాండ్ చేయ‌డం వంటి టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారం చూస్తుంటే క‌రోనా కంట్రోల్ చేయ‌కుండా ప్ర‌భుత్వాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించే ప‌నిలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ చ‌ర్య‌ల్లో విఫ‌లం అయితే నింద‌లు వేయాల‌ని ఆశిస్తున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే క‌రోనా స‌హాయ‌క చ‌ర్య‌ల ఆరంభం నుంచి టీడీపీ అధినేత తీరు అలానే ఉంది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, ఆయ‌న త‌న‌యుడు సొంత ఇంట్లో, ప‌క్క రాష్ట్రంలో ధీమాగా ఉంటారు. ఏపీలో ప్ర‌భుత్వం ఆర్థిక చిక్కులు, అనేక ఆటంకాలు ఎదుర్కొంటూ దేశంలోనే అత్య‌ధిక స‌గ‌టున ప‌రీక్ష‌లు, అతి తక్కువ మోతాదులో మ‌ర‌ణాలు న‌మోదు చేసే స్థాయిలో ఉంటే దానిపై కూడా నింద‌లు వేస్తారు. మెరుగైన నిర్ణ‌యాలు చేయ‌డానికి తోడ్ప‌డాల్సిన స‌మ‌యంలో త‌ద్విరుద్ధంగా రాజ‌కీయ త‌గాదా రాజేస్తున్నారు. అదే స‌మ‌యంలో పాల‌క‌ప‌క్షం స్పంద‌న కూడా త‌గుదున‌మ్మా అన్న‌ట్టుగా త‌యార‌య్యింది. కొంద‌రు మంత్రులు చంద్ర‌బాబు మీద చేస్తున్న విమ‌ర్శ‌లు ప్ర‌జ‌ల‌ను మెప్పించేలా క‌నిపించ‌డం లేదు. ప‌రిమితుల‌ను, ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని రాజ‌కీయ కుట్ర‌ల‌ను ఎదుర్కోవాలే త‌ప్ప సాధార‌ణ రోజుల్లో మాదిరిగా చెల‌రేగిపోతే సామాన్యుడికి రుచించ‌ద‌న్నది వారు గుర్తెర‌గాలి. ఏమ‌యినా విప‌త్త వేళ కూడా ఏపీ రాజ‌కీయ విచిత్రాలు ఏమాత్రం స‌మ‌ర్థ‌నీయం కాదు. దానికి చంద్ర‌బాబు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికైనా తీరు మార్చుకోక‌పోతే ఆయనకు తలనొప్పులు పెరగడమే తప్ప ప్రయోజనం ఉండదని గుర్తిస్తే మేలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి