iDreamPost

శీతాకాలం.. అజాగ్రత్తతో పెరుగుతున్న కరోనా ముప్పు

శీతాకాలం.. అజాగ్రత్తతో పెరుగుతున్న కరోనా ముప్పు

దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 38,617 పాజిటివ్‌లు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. వీటితో కలిపి ఇప్పటి వరకు 89,12,907 పాజిటివ్‌లను గుర్తించారు. వీరిలో 83,35,109 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. 4,46,805 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు దేశంలో ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,30,993 మంది కోవిడ్‌ కారణంగా మృత్యువాత పడ్డారు. పలు రాష్ట్రాల్లో బైటపడుతున్న కోవిడ్‌పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది.

వాతావరణంలో వచ్చిన మార్పులు, చలి తీవ్రత నేపథ్యంలో మరింతగా పాజిటివ్‌లు పెరుగుతాయని వైద్య రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు వివిధ కారణాలతో ప్రజలు విస్తృతంగా రోడ్లమీదకు వస్తుండడం కూడా వారి ఆందోళనకు కారణమంటున్నారు. దాదాపు 60శాతం మందికిపైగా కనీసం మాస్కు కూడా ధరించకుండా సంచరిస్తుండడాన్ని నిపుణులు ముఖ్యంగా ప్రస్తావిస్తున్నారు. భౌతిదూరం, మాస్కు, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించకపోతే కరోనా వేవ్‌ మరింత ఉధృతంగా ప్రభలుతుందని అంచనా వేస్తున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్ల 66,778 శాంపిల్స్‌ను పరీక్షించగా 1,395 మందికి పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో రాష్ట్రం మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 8,56,159 చేరింది. వీరిలో 8,32,284 మంది చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరుకున్నారు. 16,985 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌ కారణంగా ఇప్పటి వరకు ఏపీలో 6,890 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 92,64,085 శాంపిల్స్‌ను పరీక్షించారు. పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం విద్యార్ధులు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేయడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. నిర్ణీత షెడ్యూల్‌ను అనుసరించి ఆయా స్కూల్స్‌లో కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తోంది.

అలాగే తెలంగాణాలో గత 24 గంటల్లో 42,433 మందికి వైరస్‌ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 948 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,59,776 మందికి పాజిటివ్‌ సోకినట్టుగా బులిటెన్‌లో పేర్కొన్నారు. అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారు ఇప్పటి వరకు 1,415 మందిగా తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు 2,45,293గా చెబుతున్నారు. తెలంగాణాలో ప్రస్తుతం 13,068 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ప్రభుత్వ బులెటెన్‌ స్పష్టం చేస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి