iDreamPost

సీఎం జగన్ కు కరోనా పరీక్షలు

సీఎం జగన్ కు కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. రాపిడ్ టెస్ట్ కిట్ ల ద్వారా జగన్ కు ఈ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో కరోనా నెగిటివ్ వచ్చింది. 10 నిమిషాల్లోనే ఫలితాలు ఇవ్వడం ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ప్రత్యేకత.

ఇప్పటి వరకు రాష్ట్రంలోని వైరాలజీ ల్యాబుల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు గరిష్టంగా నిర్ధారణ పరీక్షలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దక్షిణకొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దిగుమతి చేసుకుంది. ప్రత్యేక విమానంలో ఈరోజు దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఈరోజు ఉదయం ఈ కిట్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల ద్వారా సీఎం జగన్ తొలి సారి కరోనా పరీక్ష చేయించుకున్నారు.

ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల ద్వారా రెడ్ జోన్లలో ప్రజలకు నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ప్రతిరోజూ 10 వేల మందికి ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఏర్పడింది. కాగా రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 572 కు చేరింది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 126 కేసులు చొప్పున నమోదయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి