iDreamPost

ధారావిలో కరోనా దడ

ధారావిలో కరోనా దడ

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా గుర్తుందా. క్లీన్ ముంబాయి పేరుతో ధారావిలోని పేదలకు బహుళ అంతస్తుల ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనేది ఆ సినిమా కాన్సెప్ట్. దానికి ధారావి నాయకుడైనా కాలా ( రజనీకాంత్ ) ఒప్పుకోరు. సినిమా మొత్తం ధారావి ప్రాంతంలోని షూటింగ్ జరుపుకుంది. దేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడ ధారావి. ఇక్కడ జనాభా దాదాపు 10 లక్షలు అంటే విజయవాడ నగరంలో ఎంత మంది జనాభా ఉంటారో.. ముంబైలోని ధారావి ప్రాంతంలో అంత మంది ప్రజలు ఉంటారు.

ఇప్పుడు ధారావి కరోనా వైరస్ తో గజగజ వణికిపోతోంది. అతి తక్కువ విస్తీర్ణంలో అత్యధిక మంది ప్రజలు నివసిస్తున్న ధారావి లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇక్కడ 47 మంది కి కరోనా వైరస్ సోకడంతో ప్రభుత్వం, ప్రజలు తీవ్ర ఆందోళన లో ఉన్నారు.

ఇక మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 9,405 మందికి కరోనా వైరస్ సోకగా అందులో రెండు వేల మంది ఒక మహారాష్ట్రలోనే ఉన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు సోమవారం సాయంత్రం తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ కారణంగా 330 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మరో వెయ్యిమందికి పైగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వడం ఊరట కలిగించే అంశం. ఈశాన్య రాష్ట్రాలకు కరోనా వైరస్ పాకుతోంది. నాగాలాండ్ రాష్ట్రంలో ఈరోజు తొలి కేసు నమోదయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కట్టడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. నిత్యావసరాల కొనుగోలులో ప్రజలు భౌతిక దూరం పాటించేలా చేసేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి