iDreamPost

దేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా

దేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా

ఒక్కరోజులో 3,561 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుంది. గడచిన మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 10వేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం వల్ల దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 3,561 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల 52,952కు చేరింది. కాగా కరోనా కారణంగా 1,783 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 15,267 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో 35,902 మంది చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. కొత్తగా 1,233 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 34 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో 16,758 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 651 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.ఒక్క ముంబైలోనే 10,714 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. గుజరాత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటివరకు 6625 కేసులు నమోదవ్వగా, 396 మంది మృతిచెందారు. నిన్న ఒక్కరోజులోనే 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.తమిళనాడులో గత మూడురోజులుగా వైరస్‌ విజృంభణ అనూహ్యంగా పెరిగింది. కేవలం నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 771కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4829కి చేరగా 35మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో 1107 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 11 కేసులు నిర్దారణ అయ్యాయి. 29 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1777 మందికి కరోనా సోకగా 34 మంది మృత్యువాత పడ్డారు. 729 మంది వ్యాధి నుండి కోలుకున్నారు. నిన్న 60 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 3,820,736 మందికి కోవిడ్ 19 సోకగా 265,094 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,303,146 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,263,197 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 74,807 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి