iDreamPost

ఏపీలో ఆ జిల్లాను చుట్టుముట్టిన వైరస్‌.. కరోనా కార్చిచ్చులా మారకూడదు..

ఏపీలో ఆ జిల్లాను చుట్టుముట్టిన వైరస్‌.. కరోనా కార్చిచ్చులా మారకూడదు..

ఆంధ్రప్రదేశ్‌లో రెక్కాడితేగానీ డొక్కాడని జిల్లా ప్రకాశం. ప్లోరిన్, కరువు, వలసలు నిత్యకృత్యం. అలాంటి జిల్లాను కరోనా వైరస్‌ చుట్టుముట్టింది. జిల్లాకు నాలుగు దిక్కుల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో జిల్లా యంత్రాంగం, ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

జిల్లా కేంద్రం ఒంగోలులో రెండు కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రానికి పశ్చిమాన ఉన్న కనిగిరిలో ఒకరికి వైరస్‌ సోకింది. దక్షిణాన ఉన్న కందుకూరులో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఉత్తరాన ఉన్న చీరాలలో నలుగురికి, కారంచేడులో ఒకరికి కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు నిర్థారించారు. నిన్న మొన్నటి వరకూ ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలకే పరిమితమైన కరోనా వైరస్‌ నేడు జిల్లా నలుమూలలా చిన్న పట్టణాలకు, మండల కేంద్రాలకు వ్యాపించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.

ప్రకాశంలో నమోదయిన 11 మందిలో 10 మంది ఢిల్లీ జమాత్‌ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి 232 మంది వెళ్లారని అధికారులు ఇప్పటి వరకూ గుర్తించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత నెల 14,15 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ 16 రోజుల పాటు వీరందరూ తమ తమ ప్రాంతాల్లో సంచరించారు. రోజు వారీ పనులు, తమ వృత్తులు నిర్వర్తించారు. ఈ క్రమంలో వీరిని నుంచి వైరస్‌ ఇతరులకు సోకి ఉంటుందనే అనుమానాలు బలంగా ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకూ 58 కేసులు నమోదవగా. అందులో ప్రకాశంలోనే 11 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం ప్రకాశం జిల్లాపై ఆది నుంచి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని లాక్‌డౌన్‌ చేయకముందే ఏపీలో విశాఖ, కృష్ణా, ప్రకాశం జిల్లాలను కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. తాజా ఢిల్లీ వ్యవహారం జిల్లా మొత్తాన్నే చుట్టుముట్టినట్లైంది. ఈ మహమ్మరి కార్చిచ్చులా మారకుండా ఉండాలని కోరుకోవడమే ప్రస్తుతం ఎవరైనా చేయగలిగిన పని.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి