iDreamPost

కమర్షియల్ కూలీ పైసా వసూల్

కమర్షియల్ కూలీ పైసా వసూల్

1990లో స్వంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ లో బొబ్బిలి రాజా బ్లాక్ బస్టర్ సాధించాక పెద్దబ్బాయి సురేష్ నిర్మాతగా మొదటి ప్రయత్నంలోనే గొప్ప విజయం సాధించడం రామానాయుడు గారిని సంతోషంలో ముంచెత్తింది. అప్పటికే వెంకటేష్ హీరోగా సెటిలై స్వంత మార్కెట్ ఏర్పరుచుకున్నప్పటికీ ఈ సినిమాతో మాస్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే మరో చిత్రం చేసేందుకు సురేష్ ని ప్రోత్సహించారు నాయుడు గారు. రైల్వే కూలి టైటిల్ పాత్రధారిగా తెలుగులో స్టార్ హీరోలెవరూ పెద్దగా సినిమాలు చేయలేదని గుర్తించిన రచయితలు పరుచూరి బ్రదర్స్ ఆ పాయింట్ మీద మంచి యాక్షన్ కం డ్రామా ఎంటర్ టైనర్ సిద్ధం చేశారు.




వెంకీ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు, ఒంటరి పోరాటం తర్వాత హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనదగ్గరకు వచ్చిన ప్రతిపాదనకు పచ్చజెండా ఊపేశారు. ఆ టైంలో కూలీ అంటే అందరికీ గుర్తొచ్చేది అమితాబ్ బచ్చనే. సో కేవలం పేరుతోనే అంచనాలు మొదలవుతాయి కాబట్టి కథ విషయంలో సురేష్ బాబు పలు దఫాలు చర్చలు జరిపి కూలీ నెంబర్ 1 ఫైనల్ వెర్షన్ ఒక కొలిక్కి వచ్చేదాకా బాగా శ్రమపడ్డారు. ఒళ్ళంతా పొగరు నిండిన హీరోయిన్ పాత్రకు కొత్తమ్మాయి అయితే బాగుంటుందని బాలీవుడ్ నటి ఫరా చెల్లెలు టబుని పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారు. బొబ్బిలిరాజాకు దివ్యభారతిని ఇదే తరహాలో పరిచయం చేయడం గొప్ప ఫలితాన్ని ఇవ్వడంతో పాత హీరోయిన్లు వద్దనుకుని టబుకే ఓటేశారు



ఇళయరాజా సుమధుర సంగీతం, ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం, సిరివెన్నెల సింగల్ కార్డు సాహిత్యం ఇలా టాప్ టీమ్ సెట్ అయ్యింది. సోలో హీరోగా అప్పటికే ఇమేజ్ వచ్చేసిన మోహన్ బాబు కేవలం రాఘవేంద్రరావు అడిగారన్న కారణంగా చేసిన చివరి సపోర్టింగ్  రోల్ ఇదొక్కటే. శారద, రావు గోపాల్ రావు, బ్రహ్మానందం, నిర్మలమ్మ, కోట, రాళ్ళపల్లి తదితరులు ఇతర తారాగణం. 1991 సంక్రాంతికి శత్రువు సూపర్ హిట్ తో డబుల్ జోష్ మీదున్న వెంకటేష్ కి జులై 12న రిలీజైన కూలి నెంబర్ వన్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. బొబ్బిలిరాజా రేంజ్ కాకపోయినా బయ్యర్లకు లాభాలు ఇచ్చింది. టబుకి కెరీర్ ని స్థిరపరిచింది. రాజా స్వయంగా పాడిన కలయా నిజమాతో పాటు మిగిలిన పాటలు దండాలయ్యా, కొత్తకొత్తగా ఉన్నదే, కిలకిలమని ఆడియో ని టాప్ లో నిలిపాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి