iDreamPost

బిహార్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల : తులసిరెడ్డి గారు ఇప్పుడేమంటారో..?

బిహార్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల : తులసిరెడ్డి గారు ఇప్పుడేమంటారో..?

బిహార్‌లో పోలింగ్‌కు సమయం దగ్గరపడడంతో అన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాయి. మార్పు పత్రం – 2020 పేరుతో కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. నిరుద్యోగ భృతి 1500, పది లక్షల ఉద్యోగాలు, చిన్న, మధ్యతరహా కమతాలు ఉన్న రైతులకు రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్‌ బిల్లులో 50 శాతం రాయితీ, బాలికలు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్‌లో 90 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థినికి స్కూటీ తదితర హామీలతో ఆకర్షణీయంగా తన ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్‌ వెల్లడించింది.

బిహార్‌ కాంగ్రెస్‌ మేనిఫెస్టోతో ఏపీలోని కాంగ్రెస్‌ పార్టీకి, ప్రజలకు పెద్ద సంబంధం లేకపోయినా.. ఒకే ఒక్క కాంగ్రెస్‌ నాయుకుడు మాత్రం ఈ మేనిఫెస్టోను నిశితంగా చూడాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ఆ ఒక్క నాయకుడే కాంగ్రెస్‌ ఏపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి. సమయం, సందర్భం దొరికితే చాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఖ్యాతిని తగ్గించేందుకు తులసి రెడ్డి ప్రయత్నం చేస్తుంటారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ అమలు చేసిన పథకాలు.. కాంగ్రెస్‌ పార్టీవని చెప్పుకొస్తుంటారు. ముఖ్యంగా ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు దేశంలోనే తొలిసారి వైఎస్సార్‌ అమలు చేశారు.

అయితే తులసిరెడ్డి మాత్రం ఉచిత విద్యుత; ఆరోగ్యశ్రీ పథకాలు కాంగ్రెస్‌ పార్టీవంటారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారనేది ఎవరూ కాదనలేని విషయం. అయితే వైఎస్సార్‌ అమలు చేసిన పథకాలు అన్నీ కాంగ్రెస్‌ పార్టీవని అంటేనే ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు. తులసి రెడ్డి అన్నట్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కాంగ్రెస్‌ పార్టీవే అయితే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవంటే మాత్రం ఆయన నుంచి సమాధానం వచ్చే పరిస్థితి లేదు. తాజాగా బిహార్‌ మేనిఫెస్టోలోనూ కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ విద్యుత్‌లో 50 శాతం రాయితీ అన్నదే గానీ.. ఉచిత విద్యుత్‌ అని హామీ ఇవ్వలేదు. ఈ విషయం ఇప్పటికైనా తులసిరెడ్డి గమనిస్తారా..? లేదా..? యథావిధిగా తాను చెప్పాలనుకున్నదే చెబుతారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి