iDreamPost

Congress Schemes: తెలంగాణలో మహిళలకి రూ.2500, రూ.500 గ్యాస్, ఫ్రీ బస్సు ఎప్పుడు? పూర్తి వివరాలు, రూల్స్!

  • Published Dec 07, 2023 | 1:50 PMUpdated Dec 07, 2023 | 3:46 PM

List of Schemes in Congress Government: కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతంకం ఆరు గ్యారెంటీల అమలు ఫైల్ పైనే పెడతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీల అమలు, వాటికి అయ్యే ఖర్చుకు సంబంధించిన వివరాలు..

List of Schemes in Congress Government: కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతంకం ఆరు గ్యారెంటీల అమలు ఫైల్ పైనే పెడతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీల అమలు, వాటికి అయ్యే ఖర్చుకు సంబంధించిన వివరాలు..

  • Published Dec 07, 2023 | 1:50 PMUpdated Dec 07, 2023 | 3:46 PM
Congress Schemes: తెలంగాణలో మహిళలకి రూ.2500, రూ.500 గ్యాస్, ఫ్రీ బస్సు ఎప్పుడు? పూర్తి వివరాలు, రూల్స్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే హస్తం పార్టీ విజయంలో ఆరు గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రచార కార్యక్రమాల్లో.. కాంగ్రెస్ అధిష్టానం, అభ్యర్థులు అందరూ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తెలంగాణలో కన్నా ముందు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలానే గ్యారెంటీల పేరుతో ఓటర్లకు దగ్గరై విజయం సాధించింది. అదే వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక్కడ కూడా విజయం సాధించింది.

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై తొలి సంతకం చేస్తామని ఎన్నికల వేళ ప్రకటించింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. వీటి ముసాయిదాపై ఆయన తొలి సంతకం చేయనున్నారు. అనంతరం కేబినెట్ భేటీ అయి వీటికి ఆమోదం తెలపనుంది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీల అమలు ఎప్పటి నుంచి ఉండనుంది.. వీటి కోసం ఎంత ఖర్చు కానుంది వంటి పూర్తి వివరాలు..

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇవే..

  • మహాలక్ష్మీ పథకం : మహిళలకు ప్రతి నెలా రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ .
  • రైతు భరోసా : రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ. 500 బోనస్
  • గృహ జ్యోతి : ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • ఇందిరమ్మ ఇండ్లు : ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం
  • యువ వికాసం : విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్
  • చేయూత : నెలవారీ పింఛను రూ.4,000. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా రూ. 10 లక్షలు.

అయితే వీటిల్లో ముందుగా మహాలక్ష్మీ పథకం కింద ప్రకటించిన హామీలైన.. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ హామీలను తక్షణమే అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వీటి అమలు కోసం అధికారులు మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి వస్తే.. సిటీ, ఆర్డినరీ, డిస్ట్రిక్ సర్వీసులు అన్ని కలుపుకుంటే.. ప్రభుత్వం మీద ఏడాదిని 2500 కోట్ల రూపాయల భారం పడనుంది అని ఇప్పటికే అంచాన వేశారు.

కర్ణాటకలో గృహ లక్ష్మి అమలు, అర్హతలు ఇలా…

తెలంగాణలో మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం విషయానికి వస్తే.. కర్ణాటక ఎన్నికల సమయంలో ఇచ్చిన గృహ లక్ష్మి పథకాన్ని ఇక్కడ ప్రకటించింది కాంగ్రెస్. అయితే కర్ణాటకలో దీని కింద అర్హులైన మహిళలకు నెలకు 2 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుండగా.. తెలంగాణలో మాత్రం 2,500 రూపాయల సాయాన్ని ప్రకటించారు.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, రేషన్ కార్డు ఉన్న మహిళలు మాత్రమే దీనికి అర్హులని.. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఆర్థిక సాయం, మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, భర్తలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైనా, జీఎస్టీ రిటర్న్ లను ఫైల్ చేసిన కుటుంబాలు ఇందుకు అర్హులు కారని తెలిపింది. ఇప్పటి వరకు కర్ణాటకలో ఈ పథకం కింద సుమారు 1.10 కోట్ల మంది నమోదు చేసుకున్నారు.

ఇక తెలంగాణలో కూడా మహిళలకు ఆర్థిక సాయం అందించే విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన విధివిధానలనే పాటిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్హతల విషయంలో సేమ్ కర్ణాటకలో అమల్లో ఉన్న నిబంధనలే ఇక్కడ కూడా అమలు చేస్తారని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా నిస్సహాయ పేద మహిళలకు కొత్తగా నెలకు రూ.2500 చొప్పున సహాయం అందించాల్సి ఉండనుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఏటా దీని కోసం రూ.6 వేల కోట్ల వ్యయం కానుంది అంటున్నారు.

రూ. 500లకే గ్యాస్ సిలిండర్..

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్‌ ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను రూ.955కు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లుండగా, రోజుకు 1.8 లక్షల నుంచి 2 లక్షల సిలిండర్లను అమ్ముతున్నారు. ఈ లెక్కన రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ను అందించడానికి ఏటా కనీసం రూ.2,923.65 కోట్ల గ్యాస్‌ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్‌ ధర పెరిగిన కొద్దీ ప్రభుత్వంపై ఈ భారం మరింత పెరగనుందని అంటున్నారు.

అయితే ఈ పథకం రాష్ట్రంలో ఉన్న వారందరికీ అనగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు కూడా వర్తిస్తుందా.. లేదంటే కేవలం తెలంగాణ ప్రాంతం లబ్ధిదారులకే వర్తిస్తుందా.. అన్న దానికి సంబంధించి నిపుణుల కమిటీ మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో ఉంది.

రైతు భరోసాకు 29 వేల కోట్లు..

అలానే కాంగ్రెస్ ప్రకటించిన మరో కీలక హామీ రైతు భరోసా. దీని కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000 ఆర్థిక సాయం, వరి పంటకు రూ. 500 బోనస్ అని ప్రకటించింది. దీన్ని అమలు చేయాలంటే.. ప్రభుత్వం ప్రతి ఏటా రూ.29 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేవలం భూ యజమానికి మాత్రమే రైతు బంధు ఇచ్చేది. కానీ రాష్ట్రంలో ఎక్కువగా కౌలు రైతులు సాగు చేస్తున్నారు. దాంతో రైతు బంధు ఫలాలు వారికి అందలేదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపింది. దీన్ని గమనించిన కాంగ్రెస్.. తాము అధికారంలోకి వస్తే.. రైతు భరోసా పేరిట రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000 సాయం అందిస్తామని ప్రకటించింది. పైగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10 వేల రూపాయల సాయం మాత్రమే ఇవ్వగా.. కాంగ్రెస్  ఆ మొత్తాన్ని 15, 12 వేలకు పెంచడం ఆ పార్టీకి కలిసి వచ్చింది.

ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.15 వేల కోట్లు..

ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటించింది. దీని కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. దీని కోసం ప్రభుత్వం ఏటా 15 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. దశల వారీగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉందని.. ఏటా ఎన్ని కుటుంబాలకు వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత వచ్చాక.. దీనికి కేటాయించే నిధులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

ఆరు గ్యారెంటీల అమలు కోసమే 69 వేల కోట్లు..

అలానే ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని మిగతా హామీలైన యువ వికాసానికి రూ.10 వేల కోట్లు, గృహజ్యోతికి రూ.3,431.03 కోట్లు, చేయూతకు రూ. 21 వేల కోట్లు  ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అమలు చేస్తే డిస్కమ్‌లకు ఏటా రూ. 5 వేల కోట్లు క‌ట్టాల్సి వస్తుందని అంటున్నారు.

ఇక ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉన్న పథకాలతో పాటు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ఏటా రూ.1.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ మొత్తంలో కేవలం కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం మాత్ర‌మే ఏటా రూ. 68,652 కోట్లు అవసరమని తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉంది అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో కూడా బలంగా ప్రచారం చేశారు. ఇక త్వరలోనే రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమల్లోకి రానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కనక ఈ ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తే.. ప్రతి ఇంటికి సంక్షేమం ఫలాలు అందడమే కాక.. ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి