iDreamPost

Trisha : సినిమాలతో పోటీ పడుతున్న వెబ్ సిరీస్ లు

Trisha : సినిమాలతో పోటీ పడుతున్న  వెబ్ సిరీస్ లు

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మహా అయితే పదేళ్లు ఉండేది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే. విజయశాంతి లాంటి ఒకరిద్దరు మినహాయించి లాంగ్ ఇన్నింగ్స్ ని ఎంజాయ్ చేసినవాళ్లు తక్కువే. రాధిక, రోజా, మధుబాల తదితరులు సపోర్టింగ్ రోల్స్ కి రావడం చూశాం. ఇక ఇప్పటి జెనరేషన్ కథానాయికలకు మాత్రం ఓటిటి ప్లాట్ ఫార్మ్ మంచి వేదికగా మారుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ కు బలమైన ఊతమిస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో స్టార్ క్యాస్టింగ్ చాలా కీలకంగా మారుతోంది. అందుకే రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడకుండా సెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ట్రెండ్ ఊపు మీదుంది.

ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్, అమలా పాల్, సమంతా లాంటి వాళ్ళు వెబ్ డెబ్యూ చేసేశారు. తాజాగా త్రిష కూడా ఈ క్లబ్బులో జాయినైపోయింది. సోనీ లివ్ నిర్మిస్తున్న బృంద అనే వెబ్ సిరీస్ కోసం త్రిష షూటింగ్ మొదలుపెట్టింది. సూర్య వంగల దర్శకత్వం వహించే ఈ క్రైమ్ థ్రిల్లర్ లో సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవీంద్ర విజయ్ లాంటి నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. సౌత్ లాంగ్వేజెస్ తో పాటు హిందీలోనూ డబ్బింగ్ చేయబోతున్న ఈ సిరీస్ లో త్రిష పాత్ర తాలూకు వివరాలు ఇంకా బయటికి రాలేదు. మొన్న దసరా పండగ సందర్భంగా షూటింగ్ ని ప్రారంభించినట్టు త్రిషే వెల్లడించింది.

ఇప్పుడు స్టార్లు చిన్నవాళ్లు అనే తేడా లేకుండా అందరూ వెబ్ సిరీస్ ల మీద లుక్ వేస్తున్నారు. వెంకటేష్ రానా ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ రానా నాయుడుకు కమిట్ అయ్యారు. నాగార్జున చేయబోయేది స్క్రిప్ట్ స్టేజి లో ఉంది. చిరంజీవి బాలకృష్ణల వద్దకూ ప్రతిపాదనలు వెళ్లాయి కానీ వాళ్ళు ఓకే చెప్పలేదు. నాగ చైతన్య విక్రమ్ కాంబోలో చేస్తున్న హారర్ సిరీస్ సగం పైగానే పూర్తయినట్టు సమాచారం. మొత్తానికి సినిమాలకు మించిన సౌలభ్యం ఈ డిజిటల్ ప్రొడక్షన్స్ లో ఉండటంతో తారలు రెండూ బాలన్స్ చేసుకుంటున్నారు. ఇకపై భవిష్యత్తులో నేను వెబ్ సిరీస్ చేస్తున్నాను అని సినిమాతో సమానంగా గర్వంగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి

Also Read : Anasuya Counter To Kota : అనసూయ మీద కామెంట్స్.. ‘కోటా’కి అనసూయ ఘాటు కౌంటర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి