iDreamPost

ఆసక్తి రేపుతున్న హస్తినలో జగన్ పర్యటన , అసలు లక్ష్యం అదేనా

ఆసక్తి రేపుతున్న హస్తినలో జగన్ పర్యటన , అసలు లక్ష్యం అదేనా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి దేశ రాజధానిలో పర్యటించబోతున్నారు. కీలక సమావేశాలకు ఆయన హాజరవుతారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం భేటీ అవుతారు. ఆ తర్వాత మరింత మంది నేతలు, అధికారులను కలిసే అవకాశం ఉందని సమాచారం. ప్రధానితో సమావేశం ఉంటుందా లేదా అన్నది స్పష్టత రాకపోయినప్పటికీ అమిత్ షాతో సమావేశం సందర్భంగా కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీకి సంబంధించిన కీలకాంశాలను సీఎం ప్రస్తావించబోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆమోదించిన లెక్కలకు కేంద్రం నుంచి అంగీకారం లభించాల్సి ఉంది. అదే సమయంలో పాలనా వికేంద్రీకరణ చట్టం అమలులో అడ్డుపుల్లల విషయంపై సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో ఉన్న కార్యనిర్వాహక, న్యాయ రాజధానుల అంశంలో కేంద్రం తనకు అభ్యంతరం లేదని చెప్పేసింది. అయినప్పటికీ హైకోర్ట్ విషయంలో కేంద్రం నుంచి ఆమోదం లభించాల్సి ఉంటుంది. దానిని కూడా సీఎం ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులను కూడా విడుదల చేయాలని సీఎం కోరబోతున్నారు. ముఖ్యంగా జీఎస్టీ బకాయిల అంశం, ఉపాధి నిధుల గురించి విన్నవించే అవకాశం ఉంది. ఇక తెలంగాణా నుంచి ఏపీ క్యాడర్ కి మార్చాలని కోరిన శ్రీలక్ష్మి వ్యవహారం కొలిక్కి వచ్చింది. క్యాట్ తీర్పు ద్వారా ఆమె ఏపీలో అడుగుపెట్టారు. కానీ స్టీఫెన్ రవీంద్ర వ్యవహారం మాత్రం రెండేళ్లుగా పెండింగ్ లో ఉంది. దాంతో మరోసారి సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చని సమాచారం.

వాటితో పాటుగా రాష్ట్రానిక సంబంధించిన పలు అంశాలను సీఎం ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతీ అంశంలోనూ న్యాయస్థానాల ద్వారా ప్రతిపక్షాలు సృష్టిస్తున్న ఆటంకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే జగన్ తీసుకెళ్లారు. వాటిలో నేటికీ కొన్ని అంశాలలో కోర్టు తీరు పూర్తిగా మారినట్టు కనిపించడం లేదని భావిస్తున్నారు. అదే సమయంలో సీఎం జగన్ గతంలోనే సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి స్థానానికి ఆశావాహుల జాబితాలో ముందున్న ఎన్ వీ రమణపై నేరుగా సీజేకి ఫిర్యాదు చేశారు. జగన్ లేఖలను కోర్టు ధిక్కారణ గా పరిగణించాలని పలువురు కోరినప్పటికీ అటార్నీ జనరల్ ససేమీరా అన్నారు. అయితే సేజే మాత్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. దాంతో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే వాటిలో ఉంటుందనే అభిప్రాయం ఉంది.

సహజంగానే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఢిల్లీ వెళితే రాష్ట్రాభివృద్ధి కోసమే అన్నట్టుగా చిత్రీకరించిన ఓ సెక్షన్ మీడియా తాజాగా జగన్ పర్యటనపై బురదజల్లుడు కార్యక్రమం మొదలుపెట్టింది. గతంలోనే సీఎం జగన్ ని హెచ్చరించారంటూ వార్తలు వండి వార్చిన సంస్థలు ఈసారి మరింత అడ్డగోలుగా అర్థ సత్యాలతో నిండిన కథనాలను ఊహాగానాల రూపంలో ప్రసారం చేస్తున్న తీరులో ఆశ్చర్యం కనిపించదు. కానీ జగన్ మాత్రం రాష్ట్రానికి సంబధించిన అంశాలతో పాటుగా, ప్రభుత్వ వ్యూహాల అమలులో అమిత షా తో జరిగే సమావేశాన్ని వినియోగించుకోబోతున్నట్టు కనిపిస్తోంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమాల మూలంగా కొంత సమమతం అవుతోంది. గతంలో ఎన్నడూ ఎరుగని ప్రతిఘటన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి కనిపిస్తోంది. అదే సమయంలో ఇటీవల భారత్ బంద్ కార్యక్రమానికి పరోక్షంగా ఏపీ ప్రభుత్వం కూడా సహకరించింది. రైతు సంక్షేమం విషయంలో తాము రైతుల పట్ల ఉంటామని చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో అమిత్ షా , జగన్ సమావేశం ఆసక్తికరం అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి