iDreamPost

వాలంటీర్లపై ప్రతిపక్షాల విమర్శలు.. ఒక్క మాటతో సమాధానం చెప్పిన సీఎం జగన్‌

వాలంటీర్లపై ప్రతిపక్షాల విమర్శలు.. ఒక్క మాటతో సమాధానం చెప్పిన సీఎం జగన్‌

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారలధులుగా ఉంటూ.. సంక్షేమ పథకాలను, ప్రభుత్వ సేవలను అర్హత అధారంగా అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న వాలంటీర్లకు ఉగాది సందర్భంగా ఇవ్వాలనుకున్న అవార్డులు ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. మూడు కేటగిరీల్లో వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం వాలంటీర్ల సేవలను కొనియాడుతూ.. వారిపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న విమర్శలు, దుష్పచారాన్ని ఎండగట్టారు. వాలంటీర్లలో స్ఫూర్తిని, భరోసాను నింపేలా ప్రసంగించారు.

వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు చేస్తున్న విమర్శలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఒకే ఒక్క మాటతో సమాధానం చెప్పారు. క్రమశిక్షణతో మెలిగినంత కాలం ఎలాంటి విమర్శలకు బెదరాల్సిన పని లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పెలుతున్నా.. మీరు బెదరాల్సిన పని లేదని వాలంటీర్లలో భరోసాను నింపారు. పండ్లు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయనే నానుడిని సీఎం జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడండి అని వాలంటీర్లకు హితబోధ చేసిన జగన్‌.. విమర్శలు చేసే వారిని వారి పాపాలకు, కర్మలకు వారిని వదిలేయండంటూ ప్రతిపక్షాలను పూచికపుల్ల మాదిరిగా తీసిపారేశారు.

గడిచిన 20 నెలలుగా వాలంటీర్లు అత్యుత్తమమైన సేవలను అందించారని పలువురు వాలంటీర్ల సేవలను సీఎం ప్రస్తావించారు. వాలంటీర్లపై పొగడ్తల వర్షం కురిపిస్తూనే.. వారి పరిధి ఏమిటో కూడా సీఎం జగన్‌ గుర్తు చేశారు. మీరు చేస్తున్నది ఉద్యోగం కాదు.. సేవ అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. మానవ సేవే మాధవ సేవ అని నిత్యం గుర్తుంచుకుని ప్రజలకు సేవ చేయాలని సీఎం దిశానిర్ధేశం చేశారు. నిస్వార్థ సేవ అందిస్తున్న వాలంటీర్లకు.. ఆయా కుటుంబాలు ఇస్తున్న దీవెనలు, ఆశీస్సులే ఆస్తిని అభివర్ణించారు.

గ్రామ, వార్డు వాలంటీర్లలో 83 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాలంటీర్లకు పేదల కష్టాలు తెలుస్తాయన్నారు. అందుకే పింఛన్‌ అందజేయడంలోనూ, ఇతర పథకాలు అందించడంలోనూ ఏ మాత్రం నిర్లక్షంగా వ్యవహరించకుండా వాలంటీర్లు పని చేస్తున్నారని కొనియాడారు. 32 రకాల పథకాలు, సేవలు అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఎం జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు 241 కోట్ల రూపాయల నగదు ప్రొత్సాహకం ఇస్తున్నామని సీఎం జగన్‌ గుర్తు చేశారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సేవలు అందించడంలో వాలంటీర్లు పోటీ పడాలని పిలుపునిచ్చారు. జిల్లాల వారీగా రోజుకు ఒక నియోజకవర్గంలో రేపటి నుంచి వాలంటీర్లకు సత్కార కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. తాను ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోని ఏదైనా రెండు నియోజకవర్గాల్లో కార్యక్రమానికి హాజరవుతానని సీఎం జగన్‌ తెలిపారు.

Also Read : తిరుపతి సభ రద్దు.. మనస్సులు గెలుచుకున్న సీఎం జగన్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి