iDreamPost

వికేంద్రీకరణ మా విధానం, రాజధాని నిర్ణయం మా హక్కు, బాధ్యత – సీఎం జగన్‌

వికేంద్రీకరణ మా విధానం, రాజధాని నిర్ణయం మా హక్కు, బాధ్యత – సీఎం జగన్‌

రాజధాని వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేసేది లేదని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. లక్షల కోట్ల రూపాయలతో రాజధానిని అభివృద్ధి చేయలేమని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కూడా తమ బాధ్యత అని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వికేంద్రీకరణ వైపు అడుగువేయడం తప్పా మరో మార్గంలేదని కుండబద్ధలు కొట్టారు. ఆరు నెలల్లో రాజధానిగా అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యమా..? అని ప్రశ్నించారు. ఈ రోజు వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడారు.

‘‘ ఒక ఉద్దేశంతో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించి జాతికి అంకితం చేసింది. అందులో ఎవరెవరి బాధ్యతలు, పరిధులు ఏమిటో పొందుపరిచారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానిలో ఒకటి జోక్యం చేసుకోకుండా ఉండాలని స్పష్టంగా పేర్కొన్నారు. అలా లేదంటే కుప్పకూలిపోతాయని, న్యాయమూర్తులు రాబోయే రోజుల్లో ఒక చట్టం వస్తుందని వారంతటికి వారు ఊహించుకుని తీర్పు ఇవ్వడంపై ప్రజలకు తెలియజేయాలని ఈ చర్చ చేపట్టామని’’ సీఎం చెప్పారు.

‘‘ మూడు రాజధానులకు సంబంధించిన చట్టాన్ని రద్దు చేసి, సమర్థవంతమైన చట్టాన్ని తెస్తాము అంటే.. లేని చట్టం గురించి తీర్పు ఇచ్చారు. చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉంది. ఆ అధికారం న్యాయవ్యవస్థకు, కార్యానిర్వాహక వ్యవస్థకు లేదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారు. ప్రభుత్వాలు చేసే చట్టాలు, విధానాలు నచ్చకపోతే ప్రజలు వ్యతిరేకిస్తారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు మార్కులు వేస్తారని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘ నెల రోజుల్లో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్డు, డ్రైన్లు, విద్యుత్‌ ఇచ్చేయాలి. ఆరునెలల్లోపు రాజధాని కట్టేయాలని కోర్టులు సమయం నిర్ధేశించడాన్ని సరికాదని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం. ఈ గౌరవ సభ ద్వారా ప్రజా ప్రభుత్వంగా, ఒక బాధ్యతగా అందరి ముందు కొన్ని విషయాలు ఉంచదలుచుకున్నాం. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి లేకపోవడం వల్ల వచ్చింది. రెండో ఉద్యమం రాష్ట్ర విభజనకు దారితీసింది. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అవడం వల్ల వచ్చిందని 2010లో జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. వికేంద్రీకరణతోనే ఏపీలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన జస్టిస్‌ శివరామకృష్ణ కమిటీ చెప్పింది. మూడు రాజధానులను ప్రవేశపెట్టిన సమయంలో ఈ అంశాలను సభ ముందు పెట్టడం జరిగింది’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

‘‘ మూడు రాజధానుల బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో ప్రభుత్వం చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నాం. రాష్ట్ర రాజధాని సీఆర్‌డీఏ చట్టానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రాజ్యాంగపరంగానే కాకుండా, రాష్ట్ర శాసనసభ అధికారాలను ప్రశ్నించే విధంగా ఉంది. శాసన, కార్యానిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూల స్తంభాలు. ఈ మూడు వ్యవస్థలు తమ పరిధిలో ఏ వ్యవస్థలో జోక్యం చేసుకోకుండా పని చేయాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఆ పరిధిని దాటినట్లుగా అనిపించింది. అందుకే ఈ చట్ట సభలో చర్చించాల్సి వచ్చింది’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

‘‘ రాజధాని ఎక్కడ ఉండాలనే నిర్ణయంతోపాటు, పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్ర శాసనసభకు ఎలాంటి అధికారంలేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆ నిర్ణయాధికారాలు అన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి తప్పా.. ఈ విషయంలో రాష్ట్ర శాసనసభకు ఏ అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. ఆ మేరకు రాష్ట్ర రాజధానితోపాటు, పరిపాలన వికేంద్రీకరణపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది ఏమీలేదని చెప్పింది’’ అని తీర్పును సీఎం జగన్‌ చదివి వినిపించారు.

‘‘ ఇక్కడ హైకోర్టు తీర్పు దేశ సమాఖ్య స్పూర్తికి, శాసన సభ అధికారాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర శాసన సభ అధికారాలను హరించే విధంగా ఉంది. రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదు. కేంద్రం తన పాత్ర ఉంటుందని, అది తన అధికారమని ఎప్పుడూ చెప్పలేదు. ఏ కోర్టులోనూ కేంద్రం వాదించలేదు. ఇది సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారం అని ఆర్టికల్‌ 3ని కోట్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది’’ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

‘‘ ఈ మధ్య కాలంలో రాష్ట్ర రాజధాని విషయంలో పార్లమెంట్‌లో రాతపూర్వకంగా కూడా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రాష్ట్ర రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కేంద్రం పాత్ర ఏమీ ఉండదని టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు స్పష్టంగా సమాధానం ఇచ్చింది. హైకోర్టు ఎక్కడ ఉంటే.. అక్కడే రాజధాని ఉండాలనే వాదనను కొట్టిపారేస్తూ కూడా కేంద్రం ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన తన అదనపు అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలనే నియమం ఏమీ లేదని కూడా మరో అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది’’ అని సీఎం జగన్‌ గుర్తు చేశారు.

‘‘ రాజధానితోపాటు ఈ వివాదాలతో సంబంధం లేకుండా పరిపాలనా వికేంద్రీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారంలేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం హైకోర్టు లేదని చెబుతోంది, మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెబుతోంది. మరి ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అనడం ఎంత వరకు సమంజసమో వారు ఆలోచన చేయాలి’’ అని సీఎం జగన్‌ కోరారు.

‘‘ మేము హైకోర్టును, దాని అధికారాలను అగౌరవ పరచాలని ఈ చర్చ చేయడం లేదు. మాకు రాష్ట్ర హైకోర్టుపై అపారమైన గౌరవం ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత శాసన వ్యవస్థపై ఉంది. ఇది మనతో ఆగిపోయేది కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థ ఉంది. ప్రజలు ఎన్నుకుంటే ఇక్కడకు వచ్చాం. ఈ గౌరవాన్ని, అధికారాలను కాపాడుకోకపోతే, ప్రశ్నించకపోతే ఇక ఆ తర్వాత శాసన వ్యవస్థకు అర్థం లేకుండా పోతుంది. ఆ తర్వాత చట్టాలు ఎవరు చేస్తారు..? శాసన వ్యవస్థ చేస్తుందా..? న్యాయవ్యవస్థ చేస్తుందా..? అనే పెద్ద ప్రశ్న చరిత్రలో మిగిలిపోతుంది’’ అని సీఎం జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘ ఏ వ్యవస్థ అయినా కూడా తన పరిధి దాటకుండా, ఇతర వ్యవస్థలను గౌరవిస్తూ, తన అధికారాలకు లోబడి పని చేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు. రాజధాని వికేంద్రీకరణలో ఈ గౌరవ చట్టసభకు తీర్మానం చేసే అధికారం లేదని కూడా హైకోర్టు చెప్పింది. గౌరవ న్యాయస్థానం తన పరిధి దాటి వ్యవస్థలో కీలకమైన శాసన వ్యవహారాల్లోకి ప్రవేశించడమే అవాంఛనీయమైన సంఘటన’’ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

‘‘ అదే విధంగా హైకోర్టు తీర్పులో.. రాజధానితోపాటు ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ నిర్మాణాలను నెల లోపు పూర్తి చేయాలని, మిగతా నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇది సాధ్యమవుతుందా? ఈ విధంగా ఆచరణకు సాధ్యంకాని విధంగా ఆదేశాలు జారీ చేయరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఉంది. రాజధాని నగరంతోపాటు ఈ ప్రాంతంలో చూపిన మాస్టర్‌ప్లాన్‌ పేపర్‌పై, గ్రాఫిక్‌ రూపంలో మాత్రమే ఉంది. అప్పటి ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో నోటిఫై చేసింది’’ అని సీఎం జగన్‌ గుర్తు చేశారు.

‘‘ సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణ ప్రక్రియ 20 ఏళ్లు కాగా, ప్రతి ఐదేళ్లకు దాన్ని సమీక్షించాలని రాశారు. అంటే 20 ఏళ్లకు కూడా సాధ్యం కాదని వారికి కూడా తెలుసు. ఆరేళ్ల క్రితం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్, ఇప్పటికీ గ్రాఫిక్స్‌ రూపంలో ఉంది. కనీస మౌలిక వసతులు కూడా లేని ఈ ప్రాంతంలో ఆ నాడు ఆ ప్రభుత్వం వేసిన అంచనా ఎకరాకు రెండు కోట్ల రూపాయల చొప్పన 1.09 లక్షల కోట్ల రూపాయలు. పెరుగుతున్న ధరలను చూసుకుంటే.. కనీసం అంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. ఏ రాజధానిని తీసుకున్న.. ఆయా రాజధానులు నిర్మాణం శతాబ్ధాల తరబడి జరిగింది’’అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘ 2016లో చంద్రబాబు దీన్ని మొదలు పెట్టి.. 2019 వరకు మూడు సంవత్సరాల్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏ ప్రభుత్వానికైనా అంతకన్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఈ ప్రాంతం మినహా మిగతా రాష్ట్రం 99.99 శాతం. ఇతర ప్రాంతాల అభివృద్ధి, పాలన, ప్రజా సంక్షేమం గురించి కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉంది కాబట్టే నేను ఇక్కడ ఇళ్లు కట్టుకున్నాను. చంద్రబాబుకు ఇక్కడ ఇళ్లు లేదు’’ అని ముఖ్యమంత్రి జగన్‌ విమర్శించారు.

‘‘ 54 వేల ఎకరాలకు ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పన 1.09 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని చంద్రబాబే లెక్కలు వేశారు. నిర్మాణానికి 20 ఏళ్లు పట్టినా.. అప్పటికి 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. ఇక్కడ కూర్చుని ఎమోషనల్‌ నిర్ణయాలు తీసుకోవడమో, ఓట్ల కోసం గ్రాఫిక్స్‌ చూపించి భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల ఓ రాజకీయ నేత.. నాయకుడు కాలేడు. నాయకుడు కావాలంటే.. ఏది సాధ్యమో అది చెప్పాలి. సాధ్యం అయితే నేను ఎందుకు చేయను. అసలు సాధ్యం అయ్యే పరిస్థితి ఉందా..?’’ అని ప్రశ్నించారు.

‘‘ చంద్రబాబుకు దీనిపై ప్రేమ లేదు. ఉంటే విజయవాడలోనో, గుంటూరులోనో పెట్టేవాడు. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. కానీ అక్కడ పెట్టలేదు. తాను, తన బినామీలు భూములు కొనుగోలు చేసి గుంటూరు, విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో పెట్టాడు’’ అని సీఎం జగన్‌ ఆరోపించారు.

‘‘ ఇలాంటి పరిస్థితి ఉంటే.. సాధ్యం కాదని తెలిసినా ఈ రకమైన సాధ్యం కాని తీర్పులు ఇస్తుంటేనే ఈ సభలో చర్చించుకుంటున్నాం. 29 గ్రామాలు, 54 వేల ఎకరాలు, 1.09 లక్షల కోట్ల గురించి మాట్లాడుతున్నాం. ఈ 54 వేల ఎకరాలు రాష్ట్రంలో ఎంత..? మిగిలిన రాష్ట్రం 99.99 శాతం ఉంది. ఆయా ప్రాంతాలు సంక్షేమం, అభివృద్ధి కోసం చూస్తున్నాయి. ఇదే రాజధాని అని నామకరణం చేసి డబ్బులు అన్నీ ఇక్కడే పెట్టడం కాదు. రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత ఉంది. సాధ్యం కానివి సాధ్యం చేయాలని, ఏ వ్యవస్థలు గానీ, న్యాయ వ్యవస్థలు గానీ నిర్థేశించలేవు. వీటిపై న్యాయ సలహాలు తీసుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

‘‘ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణను కొలిక్కి తీసుకురావడంతోపాటు రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కూడా కాపాడుతాం. వారికి కూడా అండగా నిలుస్తాం. వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేయం. వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి. అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం అందులో ఉంది కాబట్టి వెనకడుగు వేయం. అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం కాబట్టి, అందరికీ మంచి చేసేందుకు మన ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ చట్ట సభకు ఈ విషయంలో సర్వాధికారాలతోపాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, వికేంద్రీకరణ బాటలో సాగడం మినహా మరో మార్గంలేదని సవినయంగా తెలియజేసుకుంటూ.. న్యాయవ్యవస్థపై తిరుగులేని, అంచెంచలమైన విశ్వాసాన్ని మరోసారి ప్రకటిస్తున్నాను. వికేంద్రీకరణ మా విధానం. రాజధాని నిర్ణయం మా హక్కు, బాధ్యత..’’ అని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి