iDreamPost

జగన్‌ మూడు చోట్ల చెప్పారు.. ఇకనైనా ఆపుతారా..?

జగన్‌ మూడు చోట్ల చెప్పారు.. ఇకనైనా ఆపుతారా..?

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి ఖండించారు. ప్రాజెక్టు ఎత్తు ఒక్క మిల్లీ మీటర్‌ కూడా తగ్గబోదంటూ తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఈ రోజు పరిశీలించిన సీఎం వైఎస్‌ జగన్‌ అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరంపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. డీపీఆర్‌ ప్రకారమే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని మరో మారు స్పష్టం చేశారు.

పోలవరం ఎత్తు, నీటి నిల్వ చేసే విషయంపై ఓ వర్గం మీడియా, తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించారు. అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ మంత్రివర్గం పోలవరం ప్రాజెక్టుపై స్పష్టతను ఇచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని, నీటినిల్వ సామర్థ్యం తగ్గిస్తున్నారనే ప్రచారానికి సీఎం వైఎస్‌ జగన్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. డీపీఆర్‌ ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతోపాటు ఫుల్‌ రిజర్వాయర్‌ లెవెల్‌ (ఎఫ్‌ఆర్‌ఎల్‌) స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని చెప్పారు.

ఈ రోజు ప్రాజెక్టును సందర్శించిన తర్వాత కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రెండు అంశాలపై పూర్వం చెప్పిన అంశాలనే పునరుద్ఘాటించారు. నిర్థేశించుకున్న ప్రకారం పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ 45.72 మీటర్లు ఉంటుందని చెప్పారు. దేశంలో ఎక్కడ డ్యాం కట్టినా మొదటి ఏడాదే పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయరని గుర్తు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. పోలవరం ప్రాజెక్టులో మొదటి ఏడాది 33 శాతం, రెండో ఏడాది 50 శాతం, మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తామని తెలిపారు. తొలి దశ 41.5 మీటర్లలోనే 120 టీఎంసీలు నిల్వ చేయబోతున్నామని సీఎం పేర్కొన్నారు. ఆ మేరకు పునరావాస చర్యలు చేపట్టేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.

మంత్రివర్గం, అసెంబ్లీలోనూ కాదు పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెట్టేలా సీఎం వైఎస్‌ జగన్‌ సమాధానం చెప్పారు. ఇకనైనా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేతలు ఈ విషయంపై చేస్తున్న రాద్ధాంతానికి ఫుల్‌స్టాప్‌ పెడతారా..? లేక తమ దారి తమదేనన్నట్లు ఆ విధంగా ముందుకు పోతారా..? అనేది వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి