iDreamPost

ఏపీలో వ్యవసాయం పండగ కాబోతోందా..? జగన్‌ ఏం చేయబోతున్నారు..?

ఏపీలో వ్యవసాయం పండగ కాబోతోందా..? జగన్‌ ఏం చేయబోతున్నారు..?

ఉచిత విద్యుత్, పంట రుణాలు, మద్ధతు ధర వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాన్ని నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పండగలా మార్చారు. నేడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తండ్రి బాటలో పయనిస్తూ రైతులకు వ్యవసాయాన్ని శాశ్వతమైన పండగలా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం తరఫునే ఉచితంగా లేదా నామ మాత్రపు వ్యయంతో అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. పరిపాలన అంతా.. గ్రామ స్థాయిలోనే జరిగేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాలను బలంగా చేసుకుని వాటికి అనుబంధంగా వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే పని ఇప్పటికే మొదలు పెట్టారు. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన జగన్‌ సర్కార్‌.. ఈ దిశగా రైతు భరోసా కేంద్రాలను బహుళ సదుపాయాలు గల కేంద్రాలుగా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పక్కా చర్యలు చేపట్టారు.

రాష్ట్రంలోని ప్రతి రైతు భరోసా కేంద్రాల పరిధిలో గోదాములు, కోల్ట్‌ స్టోరేజీలు, ధాన్యం కళ్లాలు, యంత్ర పరికరాలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, పాలశీతలీకరణ యూనిట్లు, ఆక్వా బజార్లు, ఆహారశుద్ధి ప్లాంట్లు, ఈ–మార్కెటింగ్‌ వేదికలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ సంకల్పించారు. ఇందు కోసం 6,093 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ పనులన్నీ ఏక కాలంలో అన్ని రైతు భరోసా కేంద్రాలలో ప్రారంభం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని దిశానిర్థేశం చేశారు. ఈ సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తే.. రైతులు పంట వేసినప్పటి నుంచి సరైన ధరకు పంట అమ్ముకునే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

ధాన్యం ఆరబెట్టుకునేందుకు, పండిన పంటను నిల్వ చేసుకునే వీలు లేక రైతులు కళ్లాల్లోనే పంటను అయినకాడికి అమ్ముకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని దళారీలు రైతులను దోపిడీ చేస్తున్నారు. రైతుల వద్ద నుంచి పంట వ్యాపారుల వద్దకు వెళ్లిన తర్వాత.. ధర పెరుగుతోంది. అప్పటి వరకూ వ్యాపారులు పంటను కోల్ట్‌ స్టోరేజీల్లో పెడుతున్నారు. పెరిగిన ధర వల్ల వచ్చిన ఆర్థిక లబ్ధి వ్యాపారులకు చేరుతోంది. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు కూలి కూడా గిట్టుబాటు కానీ పరిస్థితులు నెలకొంటున్నాయి. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కల్పించే బహుళ సదుపాయాలు అందుబాటులోకి వస్తే.. రైతుల కష్టం రైతులకే దక్కనుంది. రైతే రాజు అనే మాట నిజం అయ్యే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి