iDreamPost

మంచి జరిగితే ఆశీర్వదించండి, లేదంటే ద్వేషించండి.. మారీచుల మాటలు నమ్మకండి – ప్రజలకు సీఎం జగన్‌ విన్నపం

మంచి జరిగితే ఆశీర్వదించండి, లేదంటే ద్వేషించండి..  మారీచుల మాటలు నమ్మకండి – ప్రజలకు సీఎం జగన్‌ విన్నపం

తన పాలనలో మంచి జరిగితే తనను ఆశీర్వదించాలని, లేదంటే ద్వేషించండని, అంతేకానీ మారీచుల రూపంలో ఉన్న చంద్రబాబు ముఠా మాటలను, ప్రచారాలను నమ్మవద్దని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఏం మంచి జరిగింది..? ఇప్పుడు ఏం మంచి జరిగింది అనేది బేరీజు వేసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసారావుపేటలో జరిగిన వాలంటర్లను సన్మానించే కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్‌ .. చంద్రబాబు,టీడీపీ అనుకూల పార్టీల నేతలు,ఎల్లోమీడియా పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అవుతుందట.. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట.. అనేలా చంద్రబాబు ముఠా మాట్లాడుతోందంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.

‘‘ ఈ రాష్ట్రంలో రైతులు, అక్కచెల్లెమ్మలకు, బడి, కాలేజీ పిల్లలకు, నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా కాపు, ఓసీల్లోని నా పేద వర్గాలకు.. దేవుడి దయతో మంచి చేసే అవకాశం వచ్చింది. అందరికీ గొప్ప వ్యవస్థ తీసుకువచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు. వివక్షకు తావు లేకుండా 1.34 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రతి అక్క, చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. సంక్షేమ క్యాలెండర్‌ ద్వారా ఈ ఏడాది మరో 55 వేల కోట్ల రూపాయలు నేరుగా బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరుగుతుంది. ఇలాగే మరో రెండేళ్లు ఇదే పద్ధతిలోనే దేవుడి దయతో, మీ చల్లని దీవెనతో చేయగలిగే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం.

పాదయాత్ర తర్వాత రెండే పేజీలతో ప్రకటించిన మేనిఫెస్టోను బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావించి 95 శాతం అమలు చేశాం. కనీవినీ ఎరగని రీతిలో మంచి చేశాం. ఇదే కొనసాగితే తమకు డిపాజిట్లు కూడా దక్కవని ఎల్లో పార్టీలో, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలో.. వాటికి అనుబంధంగా ఉన్న మీడియాలో కడుపుమంట కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు ఇలాగే చేస్తే.. పేదలకు జగన్‌ ఇలాగే మంచి చేస్తే.. ప్రతి అక్కాచెల్లెమ్మకు అమ్మఒడి, చేయూత, ఆసరా దక్కితే.. రైతన్నకు రైతు భరోసా దక్కితే.. ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య భరోసా దక్కితే.. ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్‌ అవ్వాతాతల చేతిలో పెడితే.. వీరి బాక్సులు బద్ధలు అవుతాయని వీరందరికీ తెలుసు.

అందుకే వీరందరూ మన రాష్ట్రం శ్రీలంక అవుతుందట.. అంటూ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఎల్లో మీడియా ఈ పాట అందుకున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలుచేయని ఈ ముఠా… రాష్ట్రాన్ని దోచుకున్న ఈ దొంగల ముఠా, ఎన్నికలప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పిన ఈ దొంగల ముఠా, ప్రజలను మోసం చేసి, మేనిఫెస్టోను కనిపించకుండా చేసి హైదరాబాద్‌లో ఉంటున్న ఈ దొంగల ముఠా.. జగన్‌పాలన ఇలాగే సాగితే తమకు ఒక్కరూ కూడా ఓటు వేయరని భయపడుతోంది. హామీలు అమలు చేసి, మంచి చేస్తే శ్రీలంక అవుతుందట. వారి మాదిరిగా ప్రజలను మోసం చేస్తే అమెరికా అవుతుందట. న్యాయం, ధర్మం, నీతి పదాలకు అర్థం కూడా వీరికి తెలియదు.

ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌లో వివక్షకు, లంచంకు తావు లేకుండా వారు ఒక్కరోజు మంచిపని చేయలేదు. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌లో మనం మంచి చేస్తున్నాం. తేడా గమనించండి. గతంలో దోపిడీ చేసి, అప్పులు చేసింది వీళ్లే. మంచి చేస్తున్న మన ప్రభుత్వంపై నిందలు వేస్తున్నది వీళ్లే. చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు నిందలు వేస్తున్నారు. మన చదువులు, మన పిల్లలను ద్వేషించే వారిని మనుషులు అనాలా..? దెయ్యాలు అనాలా..? వీరికి మద్ధతు ఇస్తున్న ఎల్లో మీడియాను మీడియా అనాలా.? రక్త పిశాచులు అనాలా..?

ప్రధానితో గంటకు పైగా మంచి వాతావరణంలో సమావేశం జరిగింది. అది జీర్ణించుకోలేని వీరందరూ జగన్‌కు క్లాస్‌ పీకారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈనాడు, రాధాకృష్ణ, చంద్రబాబు, దత్తపుత్రుడు గానీ.. నేను, మోడీ మాత్రమే ఉన్న రూమ్‌లో మోడీ సోఫా కిందనో, లేదా నా సోఫా కిందనో వీరు ఎవరైనా ఉన్నారా..? అని అడుగుతున్నాను. ఈ రకమైన మాటలు, దుష్ప్రచారాలు చూస్తుంటే.. దీనిని అసూయ అంటారు. దీనికి మందులేదు. ఇలా ఉంటే త్వరగా బీపీ వస్తుంది. అనారోగ్యం వస్తుంది. త్వరగా టిక్కెట్‌ తీసుకుంటారు. అందుకే ఇంత అసూయ పనికిరాదు. ఈ రోజు మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. మోసం చేయడానికి మారీచుడు రూపాలు మార్చుకుంటాడు. వీరు కూడా అంతే. ఎవరితో కావాలంటే వారితో కలుస్తారు. కలుస్తారు.. విడిపోతారు. ఎలాగూ అమలు చేయరు కాబట్టి హామీలు ఇస్తారు. ఆ తర్వాత రాష్ట్రానికి చుట్టం మాదిరిగా వచ్చి పోతుంటారు.

విడిగా పోటీ చేస్తే వారికి మంచి జరుగుతుందంటే వేర్వేరుగా పోటీ చేస్తారు. వారికి గిట్టని ప్రభుత్వం ఉంటే.. వ్యతిరేక ఓటు చీలకూడదనుకుంటే కలిసి పోటీ చేస్తారు. చెప్పిందే చెబుతూ నమ్మించే ప్రయత్నం చేస్తారు. పేరుకు వేర్వేరు వ్యక్తులు, పార్టీలు అయినా వీరందరూ ఒక గజ దొంగల ముఠా. వీరికి నీతి లేదు, నియమం లేదు. న్యాయం లేదు. ధర్మం లేదు. ప్రజలంటే ప్రేమ లేదు. అధికారం తప్పా మరో అజెండా లేదు.

ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో చూడండి. వీరి మాటలు, ప్రచారాలు, హమీలు నమ్మవద్దని ప్రతి అక్కచెల్లమ్మలను, అన్న తమ్ముళ్లను కోరుతున్నాను. జగన్‌ వచ్చిన తర్వాత మంచి జరిగింది అనుకుంటే జగన్‌ను ఆశీర్వదించండి. జరగలేదంటే ధ్వేషించండి. అంతేగానీ ఈ దొంగల ముఠాను మాత్రం నమ్మవద్దని..’’ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి