iDreamPost

జగన్ పంథా మారింది, ఈ దూకుడు ముందు ప్రతిపక్షాలు నిలిచేనా..?

జగన్ పంథా మారింది, ఈ దూకుడు ముందు ప్రతిపక్షాలు నిలిచేనా..?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోసారి తనదైన పంథాలో సాగుతున్నారు. ప్రత్యర్థులను మరింత కలవరపరుస్తున్నారు. వాస్తవానికి జగన్ దోరణి సాధారణంగా ఆయన ప్రత్యర్థులకు మింగుడుపడదు. ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా ఆయన తన దారిన తాను వెళ్లడమే తప్ప అన్నింటిలోనూ వేలు పెట్టాలనుకునే రకం కాదు. దాంతో జగన్ ని ఉచ్చులోకి లాగేయత్నం చేసిన చాలామంది భంగపడ్డారు. ఆయన మౌనమే సమాధానంగా సాగిపోవడంతో తమకు పెద్ద చెంపదెబ్బ తగిలినట్టుగా భావించారు. కానీ ఇప్పుడు జగన్ కొత్త పంథా అవలంభిస్తున్నారు. తాజా అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆయన తీరు తేటతెల్లమవుతోంది.

మూడేళ్ల పాలనలో జగన్ పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. ఆయన మీద, వ్యక్తిత్వం మీద, ప్రభుత్వం మీద, పాలన మీద పలురకాల విమర్శలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. అయినా ఆయన తొణకలేదు. బెణకలేదు. తన దారి నుంచి పక్కకు వైదొలగలేదు.ఆటంకాలు వచ్చినా అధిగమించే యత్నం చేశారే తప్ప సమస్యల నుంచి వైదొలిగేందుకు యత్నించలేదు. అదే సమయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా వాటన్నింటికీ తన చేతలే సమాధానంగా సాగిపోయారు. కానీ ఇటీవల చేతలకు తోడుగా మాటలను కూడా సంధించే యత్నం మొదలెట్టారు. వరుసగా రెండు రోజుల్లో అసెంబ్లీలో ఆయన దూకుడు చూసిన వారికి సైతం ఆశ్చర్యం కలిగించేలా వ్యవహరించారు.

మద్యం గురించి చర్చ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాజకీయంగా దుమారం రేపేలా ఉన్నాయి. చాలాకాలంగా జగన్ మద్యం పాలసీ మీద టీడీపీ చేస్తున్న విమర్శలకు ఒక్క ప్రసంగంతో ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. జే బ్రాండ్లు, జే ట్యాక్స్ అంటూ జగన్ మీద ఎక్కుపెట్టిన అస్త్రాలన్నీ చివరకు చంద్రబాబుకే ఎదురుతగిలే పరిస్థితి ఏర్పడింది. ప్రెసిడెంట్ మెడల్ నుంచి పవర్ స్టార్ వరకూ అన్ని బ్రాండ్లతో పాటుగా ఆయా డిస్టిలరీల వెనుక ఉన్న టీడీపీ నేతల గుట్టు జగన్ రట్టు చేశారు. అందులోనూ వారం రోజులుగా మద్యం చుట్టూ టీడీపీ నేతలు వేస్తున్న కుప్పిగంతులకు సమాధానం చెప్పేందుకు సిద్ధమయిన జగన్ తన పరిణతితో ముందుకు రావడం ప్రతిపక్షాలకు గట్టి జవాబుగా మారింది.

జగన్ తీరులో ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు పదే పదే అబద్ధాలు చెబుతుంటే వాటినే నిజమని నమ్మించేందుకు ఓ సెక్షన్ మీడియా యత్నిస్తున్న తరుణంలో ఈనాడు, జ్యోతి, టీవీ5ని కూడా తన టార్గెట్ గా నిర్ధారించుకున్నారు. అందుకే ఏకకాలంలో వారందరికీ సమాధానం చెప్పేందుకు యత్నిస్తున్నారు. అదే సమయంలో జనసేన వంటి పార్టీలు ఎంతగా గొంతుచించుకున్నా ఖాతరు చేసేందుకు సిద్ధంగా లేరు. అలాంటి వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తద్వారా జగన్ తన రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ ని, అతని మాటలను లెక్కచేయకుండా విస్మరించి మరింత సతమతం చేస్తున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నథింగ్ అనడంతో సరిపెట్టకుండా ఆయనకు అండగా నిలుస్తున్న మీడియాని బోనులో నిలబెట్టేయత్నం చేయడం జగన్ రాజకీయ చతురతను చెబుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి