iDreamPost

విపక్షాలను ఆశ్చర్యపరచిన జగన్, నోరెళ్లబెట్టిన ప్రత్యర్థులు

విపక్షాలను ఆశ్చర్యపరచిన జగన్, నోరెళ్లబెట్టిన ప్రత్యర్థులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన మార్క్ పాలనా పద్ధతులు చూపించారు. ప్రత్యర్థులకు అంతుబట్టని రీతిలో వ్యవహరించారు. ఓ ప్రమాదం జరిగినప్పుడు ప్రతిపక్షాలు నష్టపరిహారం డిమాండ్ చేయడం, ప్రభుత్వం అందులో సగం అందించడం చాలాకాలంగా వస్తున్న ఆనవాయితీ. కానీ జగన్ మాత్రం దానికి భిన్నంగా స్పందించారు. తన ప్రత్యేకతను చాటుకున్నారు. పెద్ద మనసుతో ప్రభుత్వ పెద్ద ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందో చూపించారు.

తాజాగా విశాఖ గ్యాస్ లీక్ ఘటన అందరినీ కలచివేసింది. సీఎం జగన్ కూడా ప్రమాదం విషయం తెలియగానే ప్రతిస్పందించారు. హుటాహుటీన విశాఖ బయలుదేరారు. కేజీహెచ్ లో బాధితులను పరామర్శించి, అధికారులతో మాట్లాడారు. అదే సమయంలో వారికి అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ వెంటనే మీడియా ముందుకు వచ్చిన జగన్ ప్రకటన ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

ఇప్పటికే ప్రమాదంలో బాధితులను ఆదుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. మృతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందులో టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీల నేతలు చేసిన డిమాండ్ కి రెట్టింపు నష్టపరిహారం జగన్ ప్రకటించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్కో కుటుంబానికి రూ. కోటి చొప్పున నష్టపరిహారాన్ని జగన్ ప్రకటించారు. అంతేగాకుండా ఆసుపత్రిలో చికిత్స పొందేవారికి లక్ష, పదివేలు చొప్పున అందిస్తామని తెలిపారు. అంతటితో సరిపెట్టకుండా ప్రభావిత గ్రామాల్లోని 15వేల మందికి కూడా సహాయం అందించడం విశేషంగా మారింది.

నష్టపరిహారం విషయంలో గతంలో కార్పోరేట్ కంపెనీల సిబ్బంది విషయంలో కూడా అనేక రాయబారాలు జరిగిన తర్వాత మాత్రమే తగిన పరిహారం అందించే ఆనవాయితీ ఉంది. కానీ ఈసారి వాటికి భిన్నంగా నేరుగా ముఖ్యమంత్రి మిగిలిన పార్టీల నేతల కన్నా ఎక్కువ పరిహారం చెల్లించడం ఆశ్చర్యంగా మారింది. జగన్ తాను మంచి మనసున్న వ్యక్తిగా అన్ని రకాలుగా తోడుగా ఉంటానని చెప్పడమే గాకుండా అందుకు తగ్గట్టుగా పరిహారం ప్రకటించడం విశేషంగా మారింది. కంపెనీతో మాట్లాడి వారు ఎంత ఇస్తారనే దానితో సంబంధం లేకుండా తాము ముందుండి ఆదుకుంటామని చెప్పడం జగన్ ప్రత్యర్థులను, స్థానికుల్లోనే సంతృప్తిని నింపింది. సీఎంది నిజంగానే పెద్ద మనసు అని అందరూ అభినందించే పరిస్థితి ఏర్పడింది. దాంతో పాటుగా మృతుల కుటుంబీకులకు ఉద్యోగం కూడా హామీ ఇవ్వడం మరో విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి