iDreamPost

పూర్తి ఫీజులు చెల్లింపులపై సీఎం జగన్‌ చెప్పిన కారణం ఇదే..!

పూర్తి ఫీజులు చెల్లింపులపై సీఎం జగన్‌ చెప్పిన కారణం ఇదే..!

ఇంటర్‌ తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లిండంతోపాటు. హాస్టల్, మెస్‌ చార్జిల కోసం ప్రతి విద్యార్థికి 20 వేల రూపాయలు ఇచ్చే జగనన్న వసతి దీవెన పథకాలు ప్రవేశపెట్టడం వెనుక గల కారణాలను సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో విద్యా వ్యవస్థపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్‌ ఉన్నత విద్య చదివితేనే పేదరికం నుంచి బయటపడతారని పేర్కొన్నారు.

తన పాదయాత్రలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో గోపాల్‌ అనే తండ్రి చెప్పిన మాటలు తనను కలచివేశాయని పేర్కొన్నారు. ఆయన మాటలు తన జీవితంలో మారచిపోలేనన్నారు. చదువులో రాణించే తన కుమారుడును ఇంజనీరింగ్‌లో చేర్పించేందుకు ఫీజు, మెస్, హాస్టల్‌ చార్జీలు ఏడాదికి లక్ష రూపాయలు అవుతుంటే.. అందుకు అప్పు చేస్తున్నాననే కారణంతో ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో తన కుమారుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని గోపాల్‌ అనే తండ్రి చెప్పాడని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. అందుకే మరెవరూ గోపాల్‌ మాదిరిగా కుమారుడిని కోల్పోకూడదని, ఎవరికీ చదువులు భారం కాకుడదని, అప్పులు చేయకూడదనే లక్ష్యంతో పూర్తిగా ఫీజులు చెల్లించడంతోపాటు, హాస్టల్, మెస్‌ ఖర్చులకు నగదు ఇస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.

ఇప్పటి వరకు కాలేజీలకు ఉన్న బకాయలను పూర్తిగా చెల్లించామని, జూన్‌ త్రైమాసికంలోనూ కాలేజీకే నగదు ఇస్తామని, ఆ తర్వాత సెప్టెంబర్‌ త్రైమాసికం నుంచి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు నగదు జమ చేస్తామని చెప్పారు. తల్లి, లేదా తండ్రి కాలేజీకి వెళ్లి ఫీజులు కడతారని చెప్పారు. నాలుగు త్రైమాసికాల్లోనూ తాను నేరుగా తల్లులతో మాట్లాడతానని, కాలేజీల్లో సౌకర్యాలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలుసుకుని సరి చేస్తామని చెప్పారు. అంతేకాదు కాలేజీల్లో సౌకర్యాలు లేవని ఎప్పుడు ఫిర్యాదు చేయాలన్నా అందకు వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.

కాలేజీల్లో ఉండాల్సిన సౌకర్యాలను అందరికీ అందుబాటులో ఉండేలా త్వరలో ఒక వెబ్‌సైట్‌ను తీసుకొస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. కాలేజీల్లో ఏ ఏ సౌకర్యాలు ఉండాలో ఆ సమాచారం వెబ్‌సైట్‌లో ఉంటుందని, కాలేజీలు ఆయా సౌకర్యాలు తమ వద్ద ఉన్నాయనే సమాచారం అందులో పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటుంది కనుక.. కాలేజీలు పెట్టిన సమాచారం సరికానిదైతే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి