iDreamPost

రవిశంకర్‌ – జగన్‌లు ఆ మూడు అంశాలకే పరిమితమయ్యారా..?

రవిశంకర్‌ – జగన్‌లు ఆ మూడు అంశాలకే పరిమితమయ్యారా..?

హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండో రోజు కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. నిన్న శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్‌ కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం రవిశంకర్‌ ప్రసాద్‌తో సమావేశమయ్యారు.

న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో భేటీ సందర్భంగా సీఎం జగన్‌ ప్రధానంగా మూడు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారని సమాచారం. ఆ మూడు అంశాలపైనే ఇరువురి మధ్య చర్చ జరిగిందని తెలిసింది. న్యాయ శాఖకు సంబంధించిన మండలి రద్దు, దిశ చట్టం ఆమోదం, న్యాయ రాజధానిలో భాగంగా కర్నూలుకు హైకోర్టు తరలింపు.. అంశాలపై ఇరువురు దాదాపు 50 నిమిషాలపాటు చర్చించారు.

రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న మండలి రద్దు బిల్లు ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ కేంద్ర మంత్రికి విన్నవించారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు అవసరమైన ప్రక్రియ వీలైనంత వేగంగా చేపట్టాలని కోరారు. హైకోర్టు తరలింపునకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ నివేదించినట్లు సమాచారం.

సీఎం జగన్, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ల మధ్య అత్యంత సానుకూల వాతావరణంలో చర్చలు సాగినట్లు తెలుస్తోంది. జగన్‌ చేసిన విన్నపాలను సావధానంగా ఆలకించిన రవిశంకర్‌ ప్రసాద్‌ ఆయా అంశాలపై వెంటనే దృష్టిపెట్టేలా వాతావరణం ఉందని చెబుతున్నారు. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనతో… దాదాపు రెండునెలల నుంచి సాగుతున్న మూడు రాజధానుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి