iDreamPost

చీక‌టి జీవితాల‌కు రంగులద్దిన జ‌గ‌న్‌!

చీక‌టి జీవితాల‌కు రంగులద్దిన జ‌గ‌న్‌!

చేనేత కార్మికుల‌కి జ‌గ‌న్ చేసింది చిన్న సాయం కాదు. వాళ్ల క‌ష్టం మాట‌ల‌కి అంద‌నిది.

రాయ‌దుర్గంలో పుట్టి పెర‌గ‌డం వ‌ల్ల మ‌గ్గం శ‌బ్దం నాకు బాగా ప‌రిచ‌యం. స‌గం ఊరు దీనిపైన ఆధార‌ప‌డి బ‌తికేది. ఇక్క‌డ నేసే ప‌ట్టు చీర‌ల‌కి బెంగ‌ళూరులో బాగా డిమాండ్ ఉండేది. నేసే పేట‌లో కొన్ని వేల మంది కార్మికులు ఉండేవారు. అక్క‌డ ఒక‌రిద్ద‌రు స్నేహితులు ఉండ‌డంతో అప్పుడ‌ప్పుడూ వెళ్లేవాన్ని.

ఆ పేట‌లోకి అడుగు పెట్ట‌గానే ల‌య‌బ‌ద్ధంగా శ‌బ్దం వినిపించేది. షాపులో ఉన్న ప‌ట్టుచీర అంద‌మే మ‌న‌కు తెలుసు. కానీ రంగు వెలిసిపోయిన జీవితం వాళ్ల‌ది.

ఇప్పుడేమైనా కూలీ రేట్లు మారాయేమో నాకు తెలియ‌దు కానీ, అప్పుడు చాలా ఘోరం. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ ప‌నిచేసినా క‌టిక పేద‌రికం. చీక‌టి గుహ‌లాంటి ఇళ్ల‌లో మ‌గ్గం గుంత‌లు. చిన్న బ‌ల్బు వెలుగులో దార‌పు పోగుల‌తో కుస్తీ. ఆడా, మ‌గా, పిల్ల‌లంతా ప‌నిచేస్తే కూడా లాభ‌మంతా వ్యాపారుల‌దే, వీళ్ల‌కు ఆక‌లి, అనారోగ్యం మిగిలేది.

ప‌ట్టుచీర‌ల నేత కాకుండా , అద్ద‌కం ప‌ని కూడా ఉండేది. దారాల‌ను రంగుల‌తో ముంచ‌డం చాలా పెద్ద ప‌ని. చిన్న‌త‌నంలో ఆ ప‌ని లోతుపాతులు తెలియ‌క‌పోయినా, అది చాలా క‌ష్ట‌మైన ప‌ని అని అర్థ‌మ‌య్యేది. ర‌సాయ‌నాల వాస‌న మ‌ధ్య , జీవితం ద‌య‌నీయంగా క‌నిపించేది.

మా స్కూల్లో నేసే వాళ్ల పిల్ల‌లు చాలా మంది ఉండేవాళ్లు. ఉద‌యం 10 గంట‌ల‌కి స్కూల్‌. చాలా మంది ఖాళీ కడుపుల‌తో వ‌చ్చేవాళ్లు. ప్రేయ‌ర్‌లో క‌ళ్లు తిరిగి ప‌డిపోయే వాళ్లు. త‌ర‌చూ ప‌డిపోయే వాళ్ల‌లో శ్రీ‌నివాసులు ఒక‌డు. వాళ్లింట్లో అత‌ని తండ్రి, అన్న ఇద్ద‌రూ మ‌గ్గం నేసేవాళ్లు. అయినా ఈ శీను ఎప్పుడూ చిరిగిపోయిన చొక్కా, నిక్క‌రుతో వ‌చ్చేవాడు. పెళ్లిళ్లు పేరంటాళ్ల‌లో క‌ట్టుకునే ప‌ట్టు చీర‌ల‌కి ప్రాణం పోసిన వాళ్లు చిరుగుల‌తో జీవించే వాళ్లు.

ఆ రోజుల్లో అమ్మ ఒడి , చేనేత సాయం ఉంటే శీను జీవితం ఇంకోలా ఉండేదేమో. తెలివైన వాడుగా ఉండి కూడా చ‌దువు మానేసే వాడు కాదేమో!

జ‌గ‌న్ చేస్తున్న సాయం గురించి విమ‌ర్శించే వాళ్ల‌కు రూట్ లెవ‌ల్లో జ‌నం క‌ష్టాలు తెలియ‌దు. జ‌గ‌న్‌కి తెలుసు కాబ‌ట్టే చేస్తున్నాడు. పేద పిల్ల‌ల ఆక‌లి తెలిసిన వాళ్ల‌కే, స్కూళ్ల‌లో ఎంత ఇష్టంగా ఇప్పుడు ఎంత మంచి భోజ‌నం తింటున్నారో అర్థ‌మ‌వుతుంది.

కాళ్ల‌కు చెప్పులు లేకున్నా స్కూళ్ల‌కి వెళ్లిన వాళ్ల‌కే బూట్ల విలువ తెలుస్తుంది. పిల్ల‌ల చ‌దువు కోసం త‌ల్లి ప‌డే క‌ష్టం అర్థ‌మైతేనే అమ్మ ఒడి అర్థ‌మ‌వుతుంది. ఫీజులు క‌ట్ట‌లేక చ‌దువులు మానేసిన వాళ్లకే రీయంబ‌ర్స్‌మెంట్ వాల్యూ తెలుస్తుంది.

మా జ‌న‌రేష‌న్‌లో జ‌గ‌న్ లేక‌పోవ‌డం బ్యాడ్‌ల‌క్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి