iDreamPost

రాష్ట్ర ప్రగతిపై సీఎం జగన్ మేథోమథనం సమావేశాలు

రాష్ట్ర ప్రగతిపై సీఎం జగన్ మేథోమథనం సమావేశాలు

ఏపీ ప్రగతికి సంబంధించి వైఎస్ జగన్ మరో అడుగు వేశారు. వివిధ వర్గాలతో మేథోమథనం జరపాలని నిర్ణయించారు. ఈనెల 25 నుంచి ప్రారంభించబోతున్నారు. తన ఏడాది పాలనపై సమీక్షా సమావేశాలుగా వాటిని నిర్వహించబోతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడ్డాయి. వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. మే 30న వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, జూన్ 8న క్యాబినెట్ బాధ్యతలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో మే 23న వైఎస్సార్సీపీ విజయ సంకేతంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాలు ఆవిష్కరించబోతున్నారు. అదే సమయంలో అధికారికంగా ముఖ్యమంత్రి పాలనను పరుగులు పెట్టించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఒక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళిక విడుదల చేశారు. దానికి తోడుగా ఇప్పుడు సమీక్షా సమావేశాలకు సిద్ధమయ్యారు.

గతంలో కేవలం కలెక్టర్లు, ఎస్పీలతో మాత్రమే ఇలాంటి సమావేశాలు నిర్వహించగా ఈసారి సీఎం మరో అడుగు వేస్తున్నారు. వివిధ రంగాల్లో ఉన్నత అధికారులు , ఇతరులతో సమావేశాలు జరిపి అభిప్రాయ సేకరణకు పూనుకుంటున్నారు. ఈ మేధో మదనం కార్యక్రమం మొత్తం 5 రోజులు జరగబోతోంది. తొలి రోజున వ్యవసాయం, రెండవ రోజున విద్యాశాఖ, మూడో రోజున వైద్యఆరోగ్యశాఖ, నాల్గవ రోజున గ్రామ –వార్డు వాలంటరీ వ్యవస్థ, చివరి రోజున ప్రణాళిక విభాగంకు చెందిన శాఖలతో ఏడాది పాలనపై సమీక్ష జరుపుతారు. ఈ కార్యక్రమం నిర్వహణపై సీనియర్ అధికారిని ఛైర్మన్ గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజు మేధో మదన సమీక్షలు ఛైర్మన్, కమిటీ సభ్యుల పర్యవేక్షణలోనే జరుగబోతున్నాయి.

దానికి సంబంధించి వివిధ శాఖల్లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సమీక్షలకు హాజరుకావాల్సిన వారి జాబితా సిద్ధం చేస్తున్నారు. అతిథులు ఎవరిని ఆహ్వానించాలనే దానిపై కసరత్తులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తన శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. వైయస్ఆర్ నవరత్నాలలోని విద్యా నవరత్నాలుగా అమలు చేస్తున్న 1. అమ్మఒడి 2. మౌలిక సదుపాయాల రూపకల్పన 3. విద్యాప్రమాణాలు పెంపు 4. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లవిద్య 5. మాతృభాషా వికాసం 6. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, పాదరక్షలు 7. నైపుణ్యాభివృద్ధి 8.ప్రైవేటు విద్యాసంస్థలపై రెగ్యులేటరీ కమిషన్ 9. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకం వంటి అంశాలను సీఎం నిర్వహించే సమావేశంలో చర్చించబోతున్నట్టు మంత్రి తెలిపారు.

సమీక్షా సమావేశాల తర్వాత పాలనను మరింత పదును పెట్టేందుకు తగ్గట్టుగా జగన్ ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. కీలక రంగాలపై సమీక్ష చేసిన తర్వాత పలు మార్పులు తీసుకురాబోతున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రజలకు మెరుగైన పాలన కోసం పలు సంస్కరణలు తీసుకురాగా వాటి ఫలితాలు కూడా అందుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థ వంటివి అనేక మందిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పాలనలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి