iDreamPost

సీఎం మంచి మనసుకు, చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం

సీఎం మంచి మనసుకు, చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం

పాలకుల్లో మూడు రకాలుంటారు. మొదటి రకం.. మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడపదాటవు. రెండో రకం చెప్పే మాటకు చేసే పనికి పొంతన ఉండదు. ఇక మూడో రకం ఏది చెబుతారో అదే చేస్తారు. ఈ మూడో రకానికి చెందిన పాలకుడే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చెప్పిన మాట చెప్పినట్లు తు చ తప్పకుండా అమలు చేయాలన్న చిత్తశుద్ధి సీఎం జగన్‌ చేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

జగన్‌ మాటలో నిజాయతీ, పనిలో చిత్తశుద్ధికే కాదు ఆయన మంచి మనస్సున్న ముఖ్యమంత్రి అనే దానికి నిదర్శనం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్న ఉచిత షూ కార్యక్రమమే. జగనన్న విద్యా కానుక పేరున వైసీపీ ప్రభుత్వం ఏపీలో ప్రభుత్వ పాఠశాల్లోని అన్ని తరగతుల విద్యార్థులకు నాణ్యమైన బ్యాగు, బెల్ట్, మూడు జతల యూనిఫాం, షూ, సాక్స్‌లు తదితర వస్తువులు అందించేందుకు సిద్ధమైంది. బడులు తెరిచిన వెంటనే ఆ వస్తువులను వారికి అందించేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది.

బ్యాగు, బెల్ట్‌ అనేవి తరగతులను బట్టీ పలు సైజులు గుంపగుత్తగా తీసుకుని పిల్లలకు పంపిణీ చేయవచ్చు. కానీ షూ, సాక్స్‌లు మాత్రం పిల్లల పాదాలకు సరిపడే సైజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే పని చేస్తోంది. వందలు, వేలల్లో కాదు లక్షల మంది విద్యార్థుల పాదాల సైజులను ఇప్పుడు అధికారులు సేకరిస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా నాణ్యమైన, వారికి సరిపడే సైజుల్లో షూ, సాక్క్‌లు ఇచ్చేందుకు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల నుంచి సైజులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సెలవులు ఉన్నా.. విద్యార్థులను ఉపాధ్యాయులు పిలిపిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ వారి నుంచి పాదాల కొలతలు తీసుకుంటూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తున్నారు.

గతంలో ఏడాదికి రెండు జతల యూనిఫాం మాత్రమే ఇచ్చేవారు. అదీ కూడా అప్పటికే కుట్టిన బట్టలు పంపిణీ చేస్తుండడంతో.. పిల్లలకు ఏ మాత్రం సౌకర్యవంతంగా ఉండేవి కాదు. ఒకరికి బిగుతుగా ఉంటే.. మరొకరికి లూజుగా ఉండేవి. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉండేలా మూడు జతల యూనిఫాంకు అవసరమైన బట్ట ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకు అవసరమైన కుట్టుకూలి నగదు కూడా ఇచ్చి వారినే స్థానిక దర్జిల వద్ద కుట్టించుకునేలా చర్యలు చేపట్టింది.

ఇక యూనిఫాంకు అధనంగా ఈ ఏడాది వైసీపీ ప్రభుత్వం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగు, బెల్ట్, షూ, సాక్స్, టై.. తదితరాలు ఉచితంగా అందిస్తోంది. పిల్లలకు నాణ్యమైన వస్తువులు ఇవ్వాలని ఇప్పటికే చెప్పిన సీఎం జగన్‌ తన చిత్తశుద్ధిని చేతల్లోనూ చూపిస్తున్నారు. రేపు ప్రారంభమయ్యే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల రూపం.. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థుల రూపాన్ని తలదన్నేలా ఉంటుందనడంలో సందేహం లేదు. పిల్లలను చూసే ప్రజలు.. కార్పొరేట్‌ పాఠశాలలు గ్రామాల్లో కూడా పెట్టారా..? అని అనుకున్నా ఆశ్చర్యం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి