iDreamPost

వైఎస్‌ జగన్‌.. ఆ పేరు మరచిపోయారా..!?

వైఎస్‌ జగన్‌.. ఆ పేరు మరచిపోయారా..!?

దాదాపు 11 ఏళ్ల తన రాజకీయ జీవితంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ఈ పదకొండేళ్లలో ఆయనను ఆది నుంచి అభిమానించిన వాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారు. ధ్వేషించే వాళ్లు అదేస్థాయిలో ఉన్నారు. తలలు పండిన రాజకీయ నేతలకు, కొమ్ములు తిరిగిన జర్నలిస్టులు, కాకలుతీరిన రాజకీయ విశ్లేషకులు, ఆయన ప్రతి అడుగు, మాటను చూసి పరవశించే అభిమానులకు, నిత్యం ఆయన పక్కన ఉండే సన్నిహితులకు.. అందరూ కూడా వైఎస్‌ జగన్‌ రాజనీతి అర్థం చేసుకునేందుకు నేటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారికి సాధ్యం కావడం లేదు.

సముద్రం లోతు.. వైఎస్‌ జగన్‌ రాజనీతి తెలుసుకోవాలనుకోవడం రెండూ ఒక్కటే. ఈ మాట రాయడానికి బలమైన కారణం ఉంది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ 2018 నవంబర్‌ 6వ తేదీన ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర 2019 జనవరి 9వ తేదీ వరకూ కొనసాగింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 3,648 కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా సాగింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే.. జగన్‌ పాదయాత్ర 134 నియోజకవర్గాల గుండా సాగింది. ఈ క్రమంలో 124 బహిరంగ సభల్లో వైఎస్‌ జగన్‌ అశేష జనవాహనిని ఉద్దేశించి ప్రశంగించారు.

ప్రతి బహిరంగ సభలో ఓ వైపు తన పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో వివరంగా చెప్పారు. నవరత్నాలు ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు ఎలా నింపుతామో వివరించారు. ఆయా పథకాలకు అర్హులు ఎవరో కూడా చెప్పారు. పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హతే ఆధారంగా పథకాలు అందిస్తామని చెప్పారు. అదే సమయంలో మరో వైపు.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై నిలదీశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ. వాటి అమలు ఎలా ఉందో ప్రజలనే అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రతి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌.. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును పదే పదే పలికేవారు. ఒక్కొక్క సభలో జగన్‌ నోటి నుంచి చంద్రబాబు పేరు పలుమార్లు పలికారు. బహుసా చంద్రబాబు పేరు వైఎస్‌ జగన్‌ పలకని బహిరంగ సభ లేదంటే అతిశయోక్తి కాదు.

Read Also: బాబు వాదనలో బలమేదీ..?

వైఎస్‌ జగన్‌.. పదే పదే చంద్రబాబు పేరు ప్రస్తావించడంపై ఆయన అభిమానులు, పార్టీ నేతలకు నచ్చేది కాదు. ఇలా మాట్లాడడం వల్ల చంద్రబాబుకు మనమే ప్రచారం కల్పిస్తున్నామనుకునేవారు. జగన్‌.. బాబు పేరు నేరుగా పలకకుండా పరోక్షంగా ప్రస్తావిస్తే బాగుంటుందేమో అని తమలో తామే అనుకున్న వాళ్ల సంఖ్య అధికంగానే ఉంది. అయితే జగన్‌.. చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ ఆయన హమీలపై నిలదీసిన ఫలితం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. బాబు చెప్పిందేమిటి..? చేసిందేమిటి..? అనేది జగన్‌ ప్రశంగాల వల్ల ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. బాబు చేసిన మోసానికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారు.

ఎన్నికలు ముగిశాయి. 2019 మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే.. దాదాపు ఏడాది రెండు నెలలుగా వైఎస్‌ జగన్‌ మచ్చుకైనా చంద్రబాబు పేరు పలకకపోవడం విశేషం. సందర్భానుసారంగానైనా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. బాబు విధానాలు, ఇచ్చిన హామీలపై నిలదీసే క్రమంలో చంద్రబాబు పేరును రోజులో పలుమార్లు పలికిన వైఎస్‌ జగన్‌.. ఇప్పుడు చంద్రబాబు అనే పేరు ఉందన్న విషయం కూడా మరిచిపోయారేమో అన్నట్లుగా 42 ఏళ్ల సీనియర్‌ రాజకీయ నాయకుడిని కనీసం తలుచుకోవడం లేదు. అందుకే ప్రారంభంలో చెప్పినట్లు.. జగన్‌ రాజనీతి అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి