iDreamPost

చెరుకులపాటి నారాయణ రెడ్డి ఇంట.. వివాహానికి జగన్ హాజరయిన ఉద్విగ్న క్షణాలలో…

చెరుకులపాటి నారాయణ రెడ్డి ఇంట..  వివాహానికి జగన్ హాజరయిన ఉద్విగ్న క్షణాలలో…

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు కర్నూల్ పర్యటనకి రానున్నారు. కర్నూల్ నగర శివారులోని రాగమాయూరి రిసార్ట్స్ ఫంక్షన్ హాల్ లో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి కుమారుడు శివారెడ్డి ల వివాహానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. సీఎం గన్నవరం విమానాశ్రయం నుండి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడనుండి రాగమయూరి ఫంక్షన్ హాల్ కి హెలికాఫ్టర్ లో చేరుకోనున్నారు. ఆనంతరం తిరిగి విజయవాడ చేరుకుంటారు. సీయం కర్నూల్ పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. సీఎం ను కలిసేందుకు ఎయిర్పోర్ట్ లో ఎవ్వరికి అనుమతి ఇవ్వలేదు. మరోవైపు ఈ వివాహానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసిపి జిల్లా నాయకులతో పాటు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారి కుటుంబ నేపధ్యం చూస్తే ఆమె భర్త దివంగత నేత చెరుకులపాటి నారాయణరెడ్డి ( కంగాటి లక్ష్మినారాయణ రెడ్డి ) జిల్లా వాసులందరికి సుపరిచితులైన రాజకీయ నాయకుడే. ఆయనకు మృదుభాషిగా వివాదరహితుడిగా మంచి పేరుంది. చెరుకూలపాడు గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి మొదటి నుండి కోట్ల కుటుంబానికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ వచ్చాడు. కోట్ల కుటుంబంతో నారాయణ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. చెరుకులపాటి నారాయణరెడ్డి నారాయణ రెడ్డి సొంత మండలం వెల్దుర్తిలో ఎక్కువభాగం 2009 వరకు డోన్ నియోజకవర్గంలో ఉండేది. అయితే పునర్విభజనలో ఆ మండలం పత్తికొండ నియోజకవర్గంలో కలిసింది.

డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో మొదటినుండి కోట్ల, కేఈ అనుచరుల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉండేది. ఈ నేపథ్యంలో చెరుకులపాటి నారాయణరెడ్డి కోట్ల ప్రధాన అనుచరుడిగా ఉన్నప్పటికీ వివాదాలకు చాలావరకు దూరంగా ఉండేవాడు. సొంత వ్యాపారాలలో నిలదొక్కుకున్న నారాయణరెడ్డి 2014 రాష్ట్రవిభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినప్పటికీ నారాయణ రెడ్డి మాత్రం 31 వేలకు పైచిలుకు ఓట్లను సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున బొత్సా కుటుంబం తరువాత నారాయణ రెడ్డే అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా నిలవడం విశేషం. అనంతరం వైసిపిలోకి చేరిన నారాయణ రెడ్డి ని వైయస్ జగన్ పత్తికొండ నియోజకవర్గానికి వైసిపి ఇంచార్జ్ గా నియమించాడు.

అయితే దురదృష్టవశాత్తు 2017 మే 22 న నారాయణ రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆయన హత్య వెనుక ప్రధానంగా మాజీమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్ బాబు హస్తం ఉందని నారాయణ రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేఈ శ్యామ్ బాబు మీద కేసు కూడా నమోదయ్యింది. ఆ సందర్భంగా నారాయణ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన వైసిపి అధినేత వైయస్ జగన్ రాష్ట్రంలోనే మొదటి వైసిపి అభ్యర్థిగా నారాయణ రెడ్డి భార్య శ్రీదేవి పేరుని ప్రకటించడం రాజకీయవర్గాల్లో సంచలనం కలిగించింది. కాకతాళీయంగా తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పత్తికొండ వైసిపి అభ్యర్థిగా పోటీచేసిన కంగాటి శ్రీదేవి తన భర్త హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఈ శ్యామ్ బాబు మీదే దాదాపు నలభై వేలకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించి సంచలనం సృష్టించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి