iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ.. గడువు పెట్టుకున్న ప్రభుత్వం..

స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ.. గడువు పెట్టుకున్న ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఓ క్లారిటీకి వచ్చింది. రిజర్వేషన్‌ వివాదం వల్ల గత నెల 17వ తేదీనే వెలువడాల్సిన మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ నెల 17వ తేదీ లోపు రిజర్వేషన్ల విషయాన్ని తేల్చాలని సుప్రిం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది.

రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా సరే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మాత్రమే ఉండాలని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినా, లేదా పటిషనర్లతో ఏకీభవించినా.. ఆ మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ఈ నిర్ణయంతో రిజర్వేషన్లపై కోర్టులో నెలకొన్న వివాదం ఈ నెల 17వ తేదీన పరిష్కారమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. తీర్పును అనుసరించి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుని ఆ వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లాపరిషత్‌ రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారు కాగా, మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అధికారులు ఇప్పటికే ఓ కొలిక్కి తెచ్చారు. ఇక రిజర్వేషన్లు ఖారారు చేయడమే మిగిలింది. ఇప్పటికే నిర్ణయించినట్లు ముందు మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ, ఆఖరున మున్సిపల్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సంస్కర ణలను తీసుకువస్తూ.. రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు బుధవారం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత 13 రోజుల్లోనూ, మండల, జిల్లా, మున్సిపల్‌ ఎన్నికలు 15 రోజుల్లోనూ పూర్తి చేసేలా చట్టంలో మార్పులు చేసేందుకు మంత్రివర్గం తీర్మానం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రచార గదువు ఏడు రోజులు, పంచాయతీకి ఐదు రోజులు కేటాయించనుంది. అంతేకాకుండా ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు రుజువైతే గెలిచిన అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించేలా నూతన నిబంధన చట్టంలో చేర్చనున్నారు. పంచాయతీ సర్పంచ్‌ ఊరిలోనే నివాసం ఉండేలా, ప్రతిరోజూ సచివాలయానికి వచ్చేలా నిబంధన చేర్చనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి