iDreamPost

విచారణకు భయమేల బాబు..!

విచారణకు భయమేల బాబు..!

చంద్రబాబుకు పోలీసులు అంటే భయమా లేక వారు ఇంకేమైనా చేస్తారు అన్న భయమో కానీ… ఆయనకు పోలీస్ నోటీసులు రాగానే కోర్టు మెట్లు ఎక్కడం మాత్రం మానుకోరు. గతంలోని సుమారు 28 సార్లు తన అరెస్టులు, విచారణలు ఆపుకుంటూ కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్న చంద్రబాబు మరోసారి కూడా తన ప్రయత్నాన్ని ఆపలేదు. తాజాగా అమరావతి భూముల వ్యవహారంలో ఆంధ్ర ప్రదేశ్ సి ఐ డి ఇచ్చిన నోటీసులకు ఆగమేఘాల మీద కోర్టు ను ఆశ్రయించి, స్క్వాస్ పిటిషన్ వేశారు. పాత పద్ధతులను నుంచి ఇంకా మూసధోరణి నుంచి చంద్రబాబు బయటకు రాలేదన్న విషయం మరోసారి దీనిద్వారా అర్థం అవుతోంది.

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. చంద్రబాబు పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశముంది. నిన్న మొన్నటి వరకు తామేమి తప్పు చేయలేదని ఎలాంటి విచారణ నైనా ఎదుర్కొంటామని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు సిఐడి పోలీసుల నోటీసు రాగానే కోర్టుకు వెళ్లడం విశేషం. అంత మాత్రం దానికి మేము తప్పు చేయలేదు అని, దేనికైనా సిద్ధమని ప్రకటించడం దేనికో అన్న ప్రశ్న తలెత్తుతోంది.

సానుభూతిని చెడగొట్టరా?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాలని భావించారు. ఈ సమావేశంలోనే సీఐ డీ ఇచ్చిన నోటీసులకు విచారణకు హాజరు కావాలా లేదా? అన్న విషయం మీద అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుగుదేశం అనుకూల మీడియా తెగ ప్రచారం చేసింది. అయితే అప్పటికే నోటీసులు మీద కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఆగమేఘాల మీద కోర్టులో పిటిషన్ దాఖలు కు వెంటనే లాయర్లను పురమాయించారు. దింతో కనీసం పార్టీ నేతలతో దీని మీద చర్చ లేకుండానే ఆయన పిటిషన్ వేసేందుకు మొగ్గు చూపారు. ఈ సమయంలో చంద్రబాబు సిఐడి విచారణకు హాజరు అయ్యి ఉంటే మున్సిపల్ ఎన్నికల చేదు ఫలితాల నుంచి ప్రజలను కాస్త చూపు మల్లించినట్లు అయ్యేదాని, పార్టీ కు సానుభూతి వచ్చేదని, చంద్రబాబును కావాలని ప్రభుత్వం వేధిస్తోందనే కోణం మీద ప్రజల్లో ప్రచారం చేసుకునే అవకాశం ఉండేదని దానిని మొత్తం చంద్రబాబు ఒక పిటిషన్ ద్వారా చెడగొట్టారని టిడిపి నేతలు కొందరు బహిరంగంగా మాట్లాడుతున్నారు. పార్టీకి వచ్చే మైలేజ్, చంద్రబాబు వంటి సీనియర్ ను సీఐడీ విచారణకు పిలవడాన్ని పార్టీ అనుకూలంగా వాడుకునేదని, చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వల్ల ఇది మొత్తం అధికార పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు… ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధ చట్టం కింద చంద్రబాబు మీద సీఐడీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సీఆర్‌పీసీలోని 41(ఏ)(1) ప్రకారం సీఐడీj నోటీసులిచ్చింది. నోటీసులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండకపోయినా, విచారణకు హాజరు కాకపోయినా చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని సీఐడీ సైబర్‌ సెల్‌ విభాగం డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి.

ఆరు రోజుల కిందట సీఐడీ కేసు నమోదు చేయగా.. ఆ ఎఫ్‌ఐఆర్‌ మంగళవారం వెలుగుచూసింది. ఐపీసీలోని 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1)(ఎఫ్‌),(జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి పి.నారాయణను ఏ2గా పేర్కొంది. ఇతర అధికారులు నిందితులుగా ఉన్నారని ఎఫ్‌ఐఆర్‌లో వివరించింది. వారి పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. పిటిషన్ మీద వెంటనే విచారణ చేసి, కీలకమైన అంశం కావడంతో చంద్రబాబు విచారణకు రావాలని ప్రభుత్వం తరుపున పట్టుబడితే హైకోర్టు ఎలాంటి తీర్పు అందిస్తుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి